కోహ్లి చేసింది తప్పుకాదు

– ఐసీసీ క్లీన్‌చిట్‌

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డగౌట్‌లో కూర్చొని వాకీ టాకీలో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది.

కెమెరాలు పదేపదే విరాట్‌ను చూపించాయి. ఇది చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఇలా ఓ ప్లేయర్‌ వాకీ టాకీలో మాట్లాడటం ఏంటి అన్న చర్చ సోషల్‌ విూడియాలో జోరుగా సాగింది. అయితే ఐసీసీ మాత్రం విరాట్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్లేయర్స్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు మొబైల్‌ ఫోన్స్‌ వాడటంపై నిషేధం ఉంది. కానీ వాకీ టాకీలకు మాత్రం అనుమతి ఉందని ఐసీసీ రూల్‌ బుక్‌ ఇది స్పష్టంచేస్తున్నది. అయితే ఇలాంటి డివైస్‌లను మూడో వ్యక్తి యాక్సెస్‌ చేయనంత వరకు వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఘటనపై అటు బీసీసీఐ, ఇటు ఐసీసీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.