కోహ్లీ మరో ఘనత

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం
న్యూఢిల్లీ,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కోహ్లీ మొత్తం 200 పరుగులు చేశాడు. సారథిగా 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి జట్టుకు ఏడోసారి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే. దీంతో పాటు ఈ జాబితాలో ఉన్న మాజీ దిగ్గజ ఆటగాళ్లను కూడా కోహ్లీ అధిగమించాడు. బ్రాడ్‌మన్‌, రిక్కీపాంటింగ్‌లు ఇప్పటి వరకూ కెప్టెన్లుగా ఆరుసార్లు మాత్రమే 200 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇప్పుడు కోహ్లీ ఈ ఘనత ఏడోసారి సాధించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
మరోవైపు ఆల్‌టైమ్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్ల జాబితాలో కోహ్లీ స్థానం పదకొండు. బ్రాడ్‌మన్‌ (961 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో కోహ్లి తర్వాత ఉత్తమ ర్యాంకు పుజారాదే. అతడు ఆరో స్థానంలో ఉండగా.. రహానె 19వ స్థానానికి చేరుకున్నాడు. హార్దిక్‌ పాండ్య బ్యాట్స్‌మన్‌, బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో 51వ స్థానంలో నిలవడం విశేషం. బుమ్రా ఐదు స్థానాలు మెరుగై 37వ స్థానం దక్కించుకున్నాడు. భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 2-1 తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.