‘క్రీడాకారులకిది సరైన సమయం’

న్యూదిల్లీ: కామన్‌వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోవింద్‌ క్రీడాకారులందరినీ అభినందించారు.

థాంక్యూ మోదీజీ: మన్‌కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ తరఫున పాల్గొన్న క్రీడాకారులను కొనియాడారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును కనబర్చారంటూ వారిపై ప్రశంసలక్రీడా వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన క్రీడాకారులు అయనకు ధన్యవాదాలు తెలిపారు.

సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైనా నెహ్వాల్‌ మాట్లాడుతూ…‘ మమ్మల్ని ఇంతలా ప్రోత్సహిస్తోన్న మోదీజీకి ధన్యవాదాలు. భారత క్రీడాకారులకు ఇది సరైన సమయం. మీరిచ్చిన స్ఫూర్తితో రానున్న క్రీడల్లో మరింత ప్రతిభ కనబరుస్తాం’ అని అన్నారు. సైనాకామన్‌వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం సాధించింది.

కామన్‌వెల్త్‌లో రెజ్లింగ్‌పోటీల్లో రజత పతకం సాధించిన బబితా ఫోగట్‌ మాట్లాడుతూ…‘ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’లో మా గురించి ప్రస్తావించడం గొప్పగా అనిపిస్తోంది. మమ్మల్ని ఇంతలా ప్రోత్సహించిన మోదీజీకి ధన్యవాదాలు. క్రీడలపై ఇంత శ్రద్ధ తీసుకుంటోన్న పీఎం గురించి నేనెక్కడా వినలేదు’ అని తెలిపారు.

షూటింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అనీష్‌ భన్వలా మాట్లాడుతూ…‘ గౌరవనీయులైన ప్రధానమంత్రి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆల్‌ ఇండియా రేడియోలో నా పేరు ప్రసావించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నాకు నిజంగా మర్చిపోలేని సమయం’ అని తెలిపారు.

ఈ సందర్భంగా మిగతా క్రీడాకారులు కూడా మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఏప్రిల్‌ 4 నుంచి 15వరకూ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్‌వెల్త్‌ క్రీడలు జరిగాయి. ఇందులో భారత్‌ 26స్వర్ణాలు, 20రజతాలు,20 కాంస్య పతకాలు సాధించింది.