ఖచ్చింతంగా అంతరిక్ష విజయమే! 

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికృతిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంతరిక్షంలో మనం భూవ్మిూద లాగా దూసుకుని పోలేం. అంచనాలు తలకిందులు అవుతాయి. ఒక్కోసారి విజయాలు వరిస్తాయి. ఇవన్నీ కూడా నిరంతర పరిశోధనల్లో భాగమే తప్ప ఇందులో విజయాలు, వైఫల్యాల లెక్కలకు తావు లేదు. ఇస్రో శాస్రవేత్తలు నిరంతరపరిశోధకులు. వారి పరిశోధనలకు ప్రతి ఒక్కరు తలవంచి సెల్యూట్చేయాల్సిందే. అలాగే వారికి అండగా ఉండాల్సిందే. ఎంతో ఆశతోజాబిల్లిని అందుకోవాలన్న మన ఆశ నెరవేరకపోవడ అన్నది తాత్కాలికమే. ఇదిపూర్తి చేసే ఘడియలు మళ్లీ ముందున్నాయన్నది గుర్తుంచుకోవాలి. అనేక విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో దీనికి కుంగిపోరాదు. మరింత ధృఢచిత్తంతోముందుకు పోయేలా జాతి యావత్తూ శాస్త్రవేత్తల వెన్నంటి ఉండాలి. పాలకులగా ప్రభుత్వంలో ఎవరున్నా నిధులుకేటాయిస్తూ మరింతగా వెన్నుతట్టాలి. ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు ధైర్య వచనాలు చెప్పడం నిజంగా అభినందించదగ్గ వషయం. నిజానికి చంద్రయాన్‌-2 చివరి మజిలీని చేరుకున్నది. భారతీయుల ఆకాంక్షలకు, విజ్ఞాన సామర్థ్యానికి, సాంకేతిక పరిణతికి నిదర్శనమైన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలుమోపటం ద్వారా.. మనదేశ సత్తాను మరోమారు యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పనున్న ఓణంలో కించిత్‌అపచారం జరిగింది. అది శాస్త్రవేత్ల లోపంగా చూడరాదు. ప్రతికూల పరిస్థితుల ప్రభావంగానే చూడాలి. దానిపైనే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గుట్టు ఛేదించడంఖాయం. అలాగే ఈ ప్రయోగం మరోమారు జరగాలన్నదే ప్రజల ఆకాంక్షగా చూడాలి.వందల మంది శాస్త్రవేత్తలు, వేలమంది సిబ్బంది నిర్విరామ కృషితో రూపొందిన చంద్రయాన్‌-2 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. శనివారం వేకువజామున 1.53కి చంద్రుడి విూద సున్నితంగా దిగనున్న సందర్భంలో దేశం యావత్తూ ఆశగా ఆసక్తిగా ఎదురు చూసింది. శాస్త్రవేత్తలు అంతకన్నా ఉత్కంఠగా చూశారు. అయితే సంకేతాలు తెగిపోవడంతో చివరిక్షణంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. అయినంత మాత్రాన ఈ ప్రయోగాన్ని విఫలం అని చెప్పలేం. ఇదో సవాల్‌గా తీసుకుని మరింత కసిగా ఇస్రో శాస్త్రవేత్తలు ముందుకు సాగాలి. అంతరిక్ష పరిశోధనల చరిత్రలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ దిగ్విజయంగా అడుగులు వేయనున్నదని అంతా ఊహించాం. ఇప్పటికే రోదసి రంగంలో అనేక రికార్డులను నెలకొల్పిన ఇస్రో.. ఈ మహావిజయం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు కొత్తదారిని వేయనున్నదని భావించాం. అయితే దీనికే కుంగిపోవడం సరికాదు. ఈ అపూర్వ ప్రయోగం అంతా అనుకున్నట్లుగా, ముందుగా నిర్దేశిరచుకున్నట్లుగానే జరుగుతున్నదని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ తెలిపారు. చంద్రుడిపై ల్యాండర్‌ అడుగిడే 15 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠతో కూడిన సమయమని కూడా ముందే చెప్పారు. మరోవైపు, ల్యాండర్‌ విక్రమ్‌ సాప్ట్‌ ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించటం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరుకు చేరుకున్నారు. నగరంలోని ఇస్రో కేంద్రంలో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులతో కలిసి ఆ అపూర్వఘటాన్ని మోదీ తిలకించాలనుకున్నారు. అయితే చివరి క్షణంలో సంకేతాలు తెగిపోవడంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో ఛైర్మన్‌  శివన్‌ విషణ్ణ వదనాలతో ప్రకటించారు. నిజానికి శివన్‌ కృషి అమోఘం. ఆయన వెన్నంటి ఉన్న బృదం కృషి అద్వితీయం. భారతీయుల ప్రతిభకు, చిత్తశుద్ధికి చంద్రయాన్‌-2 ఒక నిదర్శనంగా నిలుస్తుంనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి అనుకున్నట్లుగా సాగివుంటే  రోవర్‌ ప్రజ్ఞ చందమామపై దిగిన తర్వాత అక్కడి నుంచి ఫొటోలను పంపించి ఉండేది. తొలిఫొటో శనివారం ఉదయం కల్ల ప్రత్యక్షమయ్యేది. విక్రమ్‌ ల్యాండర్‌
స్వీయ నియంత్రితంగా పనిచేస్తుందని.. ల్యాండింగ్‌ పక్రియలో ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా సొంతంగా పరిష్కరించుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు సిగ్నల్స్‌ రావడం ఆలస్యం కావొచ్చన్నారు. ప్రయోగం విఫలమైందనే నిర్ణయానికి రావడం సరికాదని.. కాస్త ఆలస్యంగానైనా సిగ్నల్స్‌ వచ్చే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి చంద్రయాన్‌-2 మొత్తం ప్రయోగంలో చంద్రుడిపై ల్యాండర్‌ సున్నితంగా దిగే పక్రియ అత్యంత సంక్లిష్టమైనది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇది పసికందును ఊయలలో వేయడం తో సమానమని ఇస్రో శాస్త్రవేత్తలు ముందే చెప్పారు. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అత్యంత సంక్లిష్టం గా ఉంటా యన్నారు. ల్యాండింగ్‌ పక్రియలో భాగంగా విక్రమ్‌ తన కక్ష్యను వీడి చంద్రుడి ఉపరితలం వైపు వెళ్తుంది. ఈ సమయంలో చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల దాని వేగం విపరీతంగా పెరుగుతుంది. అదేవేగంతో వెళ్తే ఉపరితలాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉండటంతో ఇంజిన్లను వ్యతిరేక దిశలో మండించి వేగాన్ని తగ్గించారు. ఒక రకంగా ఇది మనం బండికి బ్రేకులు వేయడం వంటిదే. ఇలా ‘బ్రేకింగ్‌’ పక్రియల అనంతరం విక్రమ్‌ వేగాన్ని విజయవంతంగా తగ్గించారు. అయితే చివరి క్షణంలో ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ ఆగిపోవడ మన్నదే ఇక్కడ నిరాశ కలిగించే అంశంగా చూడాలి. అంతా సవ్యంగా ప్రయోగం విజయంగానే చూడాలి. జీవితంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో పరిశోదనల్లో కూడా అంతే. ఈ మిషన్‌ ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాం. ఒకవేళ ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ వస్తే మనం అద్భుతమైన సమాచారాన్ని అందించ గలిగి ఉండేవాళ్లం. ఇకముందు అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. మన దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ ప్రపంచానికి, సైన్స్‌కు, సమస్త మానవాళికి ఎంతో సేవ చేశారు. మన ప్రయాణం మరింత ధృడంగా కొనసాగించే సత్తా ఇస్రో శాస్త్రవేత్తలకు అందాలని భారతావని కోరుకుంటోంది.