ఖమ్మంలో 7 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఖమ్మంలో ఈనెల 7 నుంచి 10 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా వామపక్షాల పార్టీలన్నింటిని ఏకం చేస్తూ ప్రజల పక్షాన నిలబడేందుకు సీపీఐ పార్టీ కృషి చేస్తుందని  అన్నారు. 2019 నాటికి వామపక్ష పార్టీలన్ని ఏకమై తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు సీపీఐ ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వం సంపన్నులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా బ్జడెట్‌ రూపొందించిందే తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగకరంగా బ్జడెట్‌ను రూపొందించలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పాలన సాగిస్తున్నారని సి.పి.ఐ.నేత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ రంగానికి పెద్దపీట వేస్తూ కార్మిక రంగాన్ని అశ్రద్ధ చేస్తుందని ఆరోపించారు. భూసేకరణలో భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వారికి ఉపాధి మార్గాలు చూపాలని సూచించారు. కార్మిక శక్తిని విస్మరించి పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీళ్లు, నిధులు కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులకు భూపంపిణీపై ఇచ్చిన హావిూని విస్మరించారన్నారు. ఎన్నికల హావిూలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణ సాధనలో యువత కీలకపాత్ర పోషించారన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు.