ఖాసీం అరెస్టుపై కౌంటరు దాఖలు చేయండి

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌,జనవరి 19(జనంసాక్షి): విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ చింతకింద కాశీం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఆయనకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశీంను సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాశీం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ పిటిషన్‌పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రఘునాథ్‌ వాదనలు వినిపించారు.విచారణ అనంతరం ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్‌ కాశీం అరెస్ట్‌పై హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసాం. కోర్టు ఆదేశాల మేరకు చీఫ్‌ జస్టీస్‌ ముందు హాజరు పరిచారు. కశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్‌ చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము.’ అని తెలిపారు.

కాశీం అరెస్టుకు నేపథ్యం ఇదీ..

మావోయిస్టు సాహిత్యం కలిగి ఉన్నాడనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌లో 2016లో కాశీంపై కేసు నమోదైంది. ఈ కేసులో సెర్చ్‌ వారెంట్‌తో శనివారం ఉదయం గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో దాదాపు 15మంది పోలీసులు ఓయూలోని డా.కాశీం ఇంటికొచ్చారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌, సాహిత్యం, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 120(బీ), 121(ఏ), 124(ఏ)లతో పాటు ఉపా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కాశీం భార్య స్నేహలత మాట్లాడుతూ.. పోలీసులు గడ్డపారతో తలుపులను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. పిల్లలను, తనను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కాశీం రచనలతో పాటు ఇతర పుస్తకాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం దారుణమన్నారు. తన భర్తను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాశీం అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్ష, కులసంఘాల విద్యార్థులను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.