గంగపుత్రులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

మత్స్యకారులకు ఉచితంగా చేపవిత్తనాల పంపిణీ: హరీష్‌ రావు

సిద్ధిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గత పాలకులు తెలంగాణ ప్రాంత గంగపుత్రుల సమస్యలు పట్టించుకోలేదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. చేప పిల్లల పెంపకం కోసం బడ్జెట్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి పొందడంలో గతంలో మత్స్యకారులు తీవ్ర యాతన పడ్డారని అన్నారు. అయితే నేడు వారి స్థితిగతులు మారాయని, కెసిఆర్‌ వారికి చేపపిలఅ/-లలను అందించి స్వయం ఉపాధికి పెద్దపీట వేశారని అన్నారు. సిద్ధిపేటలోని కోమటి చెరువు దగ్గర గంగపుత్ర భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపలు పట్టే బెస్తవారి సమస్యలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గత మూడేళ్లుగా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయిస్తున్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రూ.11కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ఏడాది 80కోట్ల చేపల పిల్లలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వర్షాలు ఆలస్యం కావడంతో కొంత ఇబ్బంది అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతంలో 11వేల చెరువులు నిండాయి. అన్ని చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రారంభిస్తామని హరీష్‌ రావు చెప్పారు. దీంతో చేపల ఉత్పత్తిలో తెలంగాణ ముందుండగలదన్నారు.