గంగానదిలో జలరవాణాకు శ్రీకారం

వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి,నవంబర్‌12(జ‌నంసాక్షి): గంగా నదిపై జల రవాణా వ్యవస్థను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇన్‌ల్యాండ్‌ పోర్ట్‌ను ఆవిష్కరించారు. జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గంగా నది ద్వారా భారీ సరకుల కంటేనర్లను మల్లీమోడల్‌ పద్ధతిలో రవాణా చేయనున్నారు. అక్టోబర్‌ 30వ తేదీన కోల్‌కతాలోని హాల్దియా నుంచి గంగా నదిపై బయలుదేరిన కంటేనర్‌ను మోదీ వారణాసిలో ఆవిష్కరించారు. పెప్సీ కంపెనీకి చెందిన ఉత్పత్తులతో ఆ కంటేనర్‌ వచ్చింది. చాలా చవకైన, పర్యావరణ హితమైన రీతిలో జల మార్గం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. హల్దియా నుంచి వారణాసి వరకు వరల్డ్‌ బ్యాంక్‌ సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కోసం సుమారు 5369 కోట్లు ఖర్చు చేశారు. ఎంవీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరుతో వచ్చిన నౌకలో మొత్తం 16 కంటేనర్లు ఉన్నాయి. ఆ కంటేనర్‌ సుమారు 16 ట్రక్కులతో సమానం అని అధికారులు చెప్పారు. భారీ నౌక మళ్లీ వారణాసి నుంచి ఫెర్టిలైజర్లతో తిరిగి వెళ్తుందని అధికారులు చెప్పారు.