గంజాయిసాగుచేస్తే కఠిన చర్యలు

గిరిజన ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): తండాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు గంజాయి పంట సాగును చేపడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పోలీస్‌ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. గంజాయితో సమాజాన్ని కలుషితం చేయవద్దన్నారు. అలా చేస్తే జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఇకపోతే ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఉపాధి పొందాలని సూచించారు. గంజాయి దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయి సాగుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదన్నారు. రైతులు గంజాయి సాగు చేసినా, ఎగుమతి, దిగుమతి చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయితో తీవ్ర అనర్థాలు ఏర్పడుతాయని, వాటికి బానిసై ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి మహమ్మరికి దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకునేందుకు పాడి పరిశ్రమపై మొగ్గు చూపాలన్నారు. ప్రతి రోజూ మంచి ఆదాయం సంపాదించవచ్చన్నారు. స్త్రీనిధి, బ్యాంకు రుణాలను ఒంటరిగా కాకుండా సామూహికంగా తీసుకొని వ్యాపారం చేస్తే అధిక లాభాలు గడించవచ్చని సూచించారు. గ్రామాల్లో ఐకేపీ సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సంఘాల్లో లేని మహిళలను సంఘ సభ్యులుగా చేర్చుకోవాలన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించాలని సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామానికో డెయిరీ ప్రారంభించినట్లు తెలిపారు.