గడ్కరీ పర్యటనలో

పోలవరం అక్రమాలు బహిర్గతమయ్యాయి
– ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యం
– డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలి
– పోలవరంపై కేంద్రం డెడ్‌లైన్‌ విధించాలి
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతన్న అక్రమాలు జరిగాయని, గడ్కరీ పర్యటనలో బహిర్గతం అయ్యాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కన బెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో కవిూషన్ల కోసమే ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగిన సంగతి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటనలో బహిర్గతమైందన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం డెడ్‌లైన్‌ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.