గడ్డంపెంచాడని ఎస్‌ఐ సస్పెన్షన్‌

లక్నో,అక్టోబరు 22(జనంసాక్షి): అనుమతి లేకుండా గడ్డం పెంచుకున్నందుకు బాగ్‌పట్‌ ఎస్‌ఐ ఒకరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గడ్డం పెంచడానికి ఉన్నతాధికారుల అనుమతి కోరాలని సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ ఇంతెసార్‌ అలీకి మూడుసార్లు హెచ్చరించినట్లు పట్టించుకోలేదు. దాంతో ఆయనపై చర్యలు తీసుకుంటూ బాగ్‌పట్‌ ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీచేయడం ఉత్తరప్రదేశ్‌ పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది.బాగ్‌పట్‌లోని రామల పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఇంతెసార్‌ అలీని ఇటీవల గడ్డం పెంచారు. అయితే గడ్డం పెంచుకునేందుకు పోలీసు శాఖ అనుమతి తీసుకోలేదు. దాంతో అనుమతి లేకుండా గడ్డం ఉంచినందుకు బాగ్‌పట్‌ ఎస్పీ ఆయనను సస్పెండ్‌ చేశారు. చాలాసార్లు గుర్తుచేసినప్పటికీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని, గడ్డం తీసుకునేందుకు నిరాకరించడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ చెప్పారు. పోలీసు మాన్యువల్‌ ప్రకారం, గడ్డం ఉంచడానికి సిక్కులకు మాత్రమే అనుమతి ఉన్నదని, మిగతా పోలీసు సిబ్బంది అందరూ తమ ముఖాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ తెలిపారు. ఒక పోలీసు గడ్డం ఉంచాలనుకుంటే అతను అనుమతి పొందాలని, ఇంతెసార్‌ అలీని పదేపదే అనుమతి పొందమని అడిగినా దానిని అనుసరించలేదు” అని ఆయన అన్నారు.ఇంతెసార్‌ అలీ ఉత్తర ప్రదేశ్‌ పోలీసు శాఖలలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరాడు. గత మూడు సంవత్సరాలుగా బాగ్‌పట్‌లో నియమితులయ్యారు. గడ్డం పెంచుకోవడానికి తాను డిపార్టుమెంటు అనుమతి కోరినప్పటికీ ఈ విషయంలో స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.