గణనీయంగా పెరిగిన ఓటర్ల సంఖ్య

కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సంఖ్యతో పోలిస్తే దాదాపుగా ప్రతి
నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య కొంతవరకు పెరిగింది. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలతో పోలిస్తే 1,63,079ఓట్లు పెరిగాయి. గత నెల 22వ తేదీన వెలువర్చిన తుది ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఈ ఎన్నికల్లో మొత్తంగా 14,70,037 మంది ఓటు వేయనున్నారు. గతంలో 13,97,973 మంది ఓటర్లుండగా ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో మార్పులు, చేర్పుల తర్వాత మొత్తంగా 72,064 ఓట్లు అధికమయ్యాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌ స్థానాలున్న ఈ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలో అత్యధికంగా(2,47,698) ఓట్లున్నాయి. అతి తక్కువగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,64,102 ఓట్లున్నాయి. ఇక కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో 2014 ఎన్నికల సమయంలో 15,42,442 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పుడు జరిగే ఎన్నికల కోసం ఏకంగా 16,33,457 మంది ఓటు హక్కుని పొంది జాబితాలో సిద్ధంగా ఉన్నారు. ఈ స్థానం పరిధిలో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ(3,15,060) ఓట్లున్నాయి. తక్కువగా వేములవాడ నియోజకవర్గంలో(2,03,836) ఓట్లున్నాయి. నిజామాబాద్‌ స్థానం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు కలిపి 4,41,307 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.