గల్లా జయదేవ్‌ వ్యాఖ్యలపై.. 

టీఆర్‌ఎస్‌ అభ్యంతరం
– వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : అవిశ్వాసంపై చర్చ వాడీవేడిగా జరిగింది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌.. విభజన సమయంనాటి అంశాలను ప్రస్తావించారు. ఆంధప్రదేశ్‌ను అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని.. తెలుగు తల్లిని రెండుగా చీల్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాదు.. ఏపీ కొత్త రాష్ట్రమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. టీడీపీ ఎంపీ ప్రసంగానికి అడ్డు తగిలారు. అప్రజాస్వామికం అన్న పదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు స్పీకర్‌ సర్థి చెప్పారు. జయదేవ్‌ ప్రసంగాన్ని కొనసాగించేందు సహకరించాలని కోరారు. అయినా ఎంపీలు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో టీడీపీ-టీఆర్‌ఎస్‌ ఎంపీల మధ్య స్వల్ప వాగ్వాదం ఏర్పడింది. స్పీకర్‌ కలుగజేసుకొని.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన సమయంలో అభ్యంతరాలను చెప్పుకోవచ్చని.. సభకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో శాంతించారు. అనంతరం తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లును.. అప్రజాస్వామికమని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామికంగానే ఏర్పడిందని.. అప్రజాస్వామిక అనే మాటను లోక్‌సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.