గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సైతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును గవర్నర్‌కు వివరించారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం, నగదు పంపిణీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్ తో చర్చించారు. కరోనా అనుమానితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. దిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ కు తెలంగాణ నుంచి 1000 మందికి పైగా వెళ్లిన నేపథ్యంలో వారి గర్తింపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్ తమిళ్ సైకి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.