గవర్నర్‌ వ్యవస్థపైనే చర్చించాలి

కర్నాటకలో ఎవరు గెలిచినా గవర్నర్‌ వ్యవస్థ మాత్రం అభాసుపాలయ్యింది. అది ఇప్పుడే కాదు గతంలోనూ అభాసు పాలయ్యింది. ఇప్పుడూ అభాసు పాలయ్యింది. గవర్నర్ల వ్యవస్థ అనవసరమని అనుకుంటున్న తరుణంలో వారంతా రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి అసెంబ్లీ బలపరీక్ష తరవాతనే ఎవరైనా సిఎం కాగలిగేలా చట్టాలను మార్చుకోవాలి. అసెంబ్లీలో నెగ్గిన తరవాతనే ఆ పార్టీ నాయకుడు సిఎం అయ్యేలా చూడాలి. పొత్తులకు సంబంధించి కూడా స్పష్టమైన విధానం ఉండాలి. ఎన్నికల్లో ఒకరిని ఒకరు తిట్టుకుని ఓట్లు పొందాక ఇప్పుడు కలసి అధికారం చేపడతామంటే రైటు అవుతుందా అన్న చర్చ కూడా చేయాలి. అయితే  గవర్నర్ల వ్యవస్థను ఎత్తేయాల్సిన అవసరం ఇటీవలి వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. నిజానికి మోడీ కాకుండా బిజెపిలో అద్వానీ లాంటి వారు ప్రధాని అయివుంటే దేశంలో విలువగల రాజకీయాలు నడిచేవి. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్ల వ్యవస్థను అపహాస్యం చేసింది. ఇష్టారాజ్యంగా వాడుకుంది. రాజ్‌భవన్లను  ఆయా రాష్ట్రాల  కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాలుగా వాడుకుంది. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ విలువలు, రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరం కాక మరోటి కాదు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్ని అపహస్యం చేసిన పార్టీగా కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోయింది. అది చేసిన పాపాలకు దానిని ఎన్ని సార్లు పాతరేసినా పరిహారం తీరదు. ఇక మోడీ ద్వయం చేతిలో ఉన్న బిజెపి కూడా కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తోంది. అలాంటప్పుడు ఓ పక్కా వ్యవస్థను నిర్మించుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలో మార్పులు చేసుకుని సక్రమంగా నడుచుకుని కోర్టుల ప్రమేయం లేకుండా సాగాలి. ఇప్పటి వరకు ఉన్న అనుభవాలను క్రోడీకరించి ముందుకు సాగాలి. అధికార సాధనే తప్ప, ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టని నేతలు, పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరిహాసమయ్యే తీరుకు కర్నాటక తాజా ఉదాహరణ. కేంద్రానికి, రాష్ట్రానికి  మధ్య సంధానకర్తలుగా నిలిచి సమాఖ్య వ్యవస్థ బలపడేలా చూడాల్సిన గవర్నర్ల వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం పాలక పార్టీలు బలి చేసిన తీరును దేశ ప్రజానీకం గతంలో అనేకం చూసింది. కేరళలో నంబూద్రిపాద్‌ మొదలు అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను కాంగ్రెస్‌ భ్రష్టుపట్టించింది. యూపిలో జగదాంబికాపాల్‌ను సీట్లో కూర్చుండబెట్టింది ఎవరన్నదానికి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. కర్నాటకలో యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు  తుంగలో తొక్కారని అంటున్న వారు గతంలో ఉన్న ఉదాహరణలు పట్టించుకోవడం లేదు. మెజార్టీ ఉన్న పార్టీని అధికార ఏర్పాటుకు పిలవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇటీవల  మణిపూర్‌, గోవా, మేఘాలయల్లోఅత్యధిక సీట్లను పొందిన పార్టీలను కాదని అడ్డదోవన బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడదే విధానం అమలు చేయాలని అంటున్న వారు గతంలో ఎలా నడిచారన్నది చూసుకోవడం లేదు.ఎన్నికల తరువాత కూటములు కట్టడం ఆ మూడు రాష్ట్రాలలో సబబైనప్పుడు కర్నాటకలో తప్పు ఎలా అయ్యిందో, కాంగ్రెస్‌, జెడిఎస్‌ కూటమి ఎలా అనర్హమైందో బిజెపి నేతలు చెప్పాలంటున్నారు. నిజానికి జెడిఎస్‌తో జతకట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలాన్ని కలిగి ఉంది. అలాంటప్పుడు ఈ రెండు పార్టీలను పిలిచి వారి బలాన్ని  తెలుసుకుని వారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండాల్సింది. కానీ అధికరాంలో ఉన్నది అంటే గవర్నర్‌గా ఉన్నది మోడీ అనుయాయుడు కనుక అలా చేస్తారని భావించలేం. నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్‌ గతంలో అనుసరించిన విధానాలనే పాటిస్తున్నారు. ఎప్పటికి ఏది అవసరమో దానిని ఆచరిస్తున్నారు. దానినే తగిన విధానంగా కొనసాగించారు.
ఇందుకు ఆయన కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలనే పాటిస్తున్నారు. కాంగ్రెస్‌ లాగానే తన అస్మదీయులను, తాబేదార్లను అనేక రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు గవర్నర్లుగా నియమితులై ఆ పార్టీకి అనుకూలంగా అనేకానేక రాజకీయాలు నెరిపారు. అవన్నీ మరచిపోయి ఇప్పుడు విమర్శలు చేసే వారు గతాన్ని తవ్వితీయాలి.  గతమంతా కరెక్టా కాదా అన్న వివేచన లేకుండా ఇప్పుడు జరిగిందే తప్పు అని అనడానికి లేదు.
చాలినంత సంఖ్యాబలం లేనప్పటికీ బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడం, బల నిరూపణ కోసం యడ్యూరప్పకు నెలాఖరు వరకు సమయం ఇవ్వడం ద్వారా కర్నాటక గవర్నర్‌ వాజుభాయి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని అంటున్న వారు ఉమ్మడి ఎపిలో నాదెండ్ల సమయంలో గవర్నర్‌ రామ్‌లాల్‌ ఎలా వ్యవహరించారో చెప్పాలి.  ఎందుకు ఎన్టీఆర్‌ను ఆనాడు పదవీచ్యుతిడిని చేశారో చెప్పాలి. అలాగే ఎన్టీఆర్‌ను బర్తరఫ్‌ చేసి చంద్రబాబను ఎందుకు సిఎం చేశారో, అందుకు కమ్యూనిస్టులు ఎందుకు వత్తాసు పలికారో చెప్పాలి. ఆనాడు లేని విలువలు ఈనాడే వీరికి గుర్తుకు రావడం ధర్మద్రోహం తప్ప మరోటి కాదు. అన్యాయంగా ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేస్తే వందిమాగధుల్లా కమ్యూనిస్టులు వ్యవహరించారు. బాబును భుజానికెత్తుకున్నారు. ఆనాటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ తీరును ఎందుకు తప్పుపట్టలేక పోయారో చెప్పలేదు. కన2ఈసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. నిజానికి ఇదంతా వ్యవస్థీకృతంగా ఉన్న లోపం. దీనిపై చర్చించాలి. ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసేలా చట్టాలు చేసుకోవాలి. రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాలి. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా పోరాడిన జెడిఎస్‌ 38 సీట్లతో ఎలా అధికారం చేపడుతుందో చెప్పాలి. ఇది అనైతికత కాదా  అన్నది విమర్శకులు చెప్పాలి. గతంలో గవర్నర్లు చేసినవన్నీ  రైటే అయితే వాజూభాయ్‌ చేసింది కూడా రైటే.. గతంలో గవర్నర్లు చేసింది తప్పయితే ప్రస్తుతం వాజూభాయి చేసింది కూడా తప్పే. దీనిపై చర్చ జరగాలి. అంతేగానీ కేవలం వాజూభాయిదే తప్పన్న రీతిలో పతివ్రతల్లా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మాట్లాడడం ప్రజాస్వామ్య ద్రోహం కాకా మరోటి కాదు.