గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న గిరిజనేతరులపై ఎల్‌టీఆర్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. వందల ఎకరాలు, విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిని వదిలి కేవలం గిరిజనులనే ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుందని అన్నారు. గిరిజనులు అంటే ప్రభుత్వానికి చులకన అన్నారు. ప్రత్యేక తెలంగాణలో కూడా వీరు అణచివేతకు గురికావడం దారుణమన్నారు. ఆయా భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేద గిరిజనులకు పంపిణీ చేయాలని డిమాండు చేశారు. ఇదిలావుంటే రెవెన్యూ అధికారుల దొడ్డిదారి వ్యవహారాలతో మన్యంలో ప్రభుత్వ భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళుతున్నాయని గిరిజన సంక్షేమ పరిషత్‌ నేతలు అన్నారు. దశాబ్దాలుగా మండలంలోని చిరుతపల్లి(జడ్‌) లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండు చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటుంటే ఓ గిరిజనేతరుడికి ఎలా హక్కు కల్పించారని ప్రశ్నించారు. అసైన్‌మెంట్‌ చేసిన భూమిని మరొకరికి ఎలా ఇస్తారని మండిపడ్డారు.