గిరిజన గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

సమస్యల పరిష్కారం చేస్తామని హావిూలు

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఏజెన్సీ గ్రామాల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పోలీసుల సహాయంతో ముందుకు వెళుతున్నారు. గిరిజనుల సమస్యలపై చర్చిస్తున్నారు. వారి సమస్యలను కొత్త ప్రభుత్వంలో తీరుస్తామని హావిూలు ఇస్తున్నారు. గ్రామాల్లో భద్రాచలం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెలంగాణ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను, కేసీఆర్‌ పాలనాతీరును ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగా

ఉందని, మేనిఫెస్టోలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ఎకరానికి పెంచడం జరిగిందన్నారు. వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016, వృద్ధాప్య, వితంతువులకు రూ.1000 నుంచి రూ.2016 వరకు పెంచుతామని ప్రకటన చేశారని, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3016 అందించేలా ప్రకటన చేయడం గొప్ప విషయమన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవి అమలవుతాయని నాయకులు ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. పోడుభూములు సాగు చేస్తున్న గిరిజనులకు ఆభూములపై హక్కులు కల్పిస్తానని, అడువుల్లో ఉంటున్న ఆదివాసీలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఓటర్లకు హావిూలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని, మళ్లీ సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారని, సీఎం కేసీఆర్‌ కూడా అటవీ భూములకు హక్కులు కలిపిస్తామని చెప్పారన్నారు.