గుడిసెలల్ల బతుకీడ్చెటోళ్లు స్మగ్లర్లా?

బ్రేకింగ్‌..బ్రేకింగ్‌… ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌. 20 మంది స్మగ్లర్ల హతం. పోలీసులపై స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి పాల్పడినందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసుల వెర్షన్‌. సరిగ్గా తెలంగాణ పోలీసులు సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టిన మూడు రోజులకే ఏపీ పోలీసుల కాల్పుల్లో 20 మంది కూలీలు హతమయ్యారు. దీనిపై ప్రజా సంఘాలు సమగ్ర విచారణకు డిమాండ్‌ చేశాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పేర్కొన్నాయి. తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీలు సహా ఘటనపై తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం సైతం ఘాటుగా స్పందించారు. తమ రాష్ట్రానికి చెందిన అమాయక తమిళులను కూృరంగా అంతం చేశారని అన్నారు. సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది. అమాయక తమిళ తంబీల వెనకున్న అసలు సూత్రధారులెవరు? సూత్రధారులను వదిలేసి అమాయక కూలీలను హతమార్చి పోలీసులు ఏం సాధించారు? ఏం సాధించాలనుకుంటున్నారు? స్మగ్లింగ్‌ దందా సాగిస్తున్న వారు, వాళ్ల వెనకున్న పెద్దలు సాక్షాత్తూ చట్టసభల్లో చక్రం తిప్పుతుంటే సామాన్య కూలీలు కాక అసలు దోషులు ఎందుకు దొరుకుతారు. దొంగలంతా దర్జాగా తప్పించుకుని తిరక్క ఏం చేస్తారు. అసలు దోషులను ఏం పీకలేక అమాయక కూలీలను స్మగ్లర్లను చేసి చంపాల్సిన దుస్థితి ఎందుకు తలెత్తింది? గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన పవిత్రమైన శేషాచలం కొండల్లో నెత్తురు ఎందుకు పారుతోంది. ఎర్ర చందనం కలప కోసం స్మగ్లర్లు-పోలీసుల మధ్య ఎదురు కాల్పులు ఎందుకు నిత్యకృత్యమైపోయాయి. గత నాలుగైదు నెలలుగా ఈ ఘర్షణ వాతావరణం ఎందుకు మరింత ముదిరింది? ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్మగ్లర్ల మధ్యనున్నా ముఠా కక్ష్యలు, వారి వెనకున్న వాళ్ల ఆధిపత్య పోరు మూలంగానే 20 మంది అమాయక తమిళులు మృత్యువాత పడ్డారా? దీని పర్యవసానమే అమాయకులపై పోలీసు కాల్పులా అంటే అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. అడవుల్లోకి గుంపులు గుంపులుగా వస్తున్న చందనం స్మగ్లర్లు.. తమకు అడ్డువచ్చే అటవీ అధికారులను చంపిన సంఘటనలు గతంలో జరిగాయి. దీంతో పోలీసులు స్మగ్లర్ల కోసం అడవంతా జల్లెడ పడుతున్నారు. అయితే అకస్మాత్తుగా పోలీసులు కూంబింగ్‌ ఎందుకు తీవ్రం చేశారు..? ఈ చందన బాగోతంలో రాజకీయ నేతల పాత్ర ఎంత..? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది..? దీనికి కారణం ఒక్కటే. ఎర్ర చందనం చాలా అరుదైన కలప. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ లోని నాలుగు జిల్లాల్లో తప్ప ఇంకెక్కడా పెరగకపోవడం దీని విశిష్టత. దీన్ని ఎర్రబంగారం అని కూడా అంటారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. ఈ ప్రాంతంలో మాత్రమే ఈ మొక్కలు పెరిగే అరుదైన వాతావరణం ఉంది. సంగీత వాయిద్య పరికరాల తయారీలో, అలంకార సామగ్రి తయారీలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఔషధగుణాలు కూడా ఉన్న ప్రత్యేకమైన చెట్టుకావడం వల్ల దీనికి ఆ రకంగానూ గిరాకీ ఎక్కువ. ప్రత్యేకించి వయాగ్రా వంటి సెక్స్‌ ఉద్దీపన ఔషధాల్లోనూ దీన్నివినియోగిస్తారు. ఈ ఎర్ర చందనాన్ని అరుదైన వృక్షజాతిగా గుర్తించిన భారత అటవీ శాఖ.. దీన్ని కాపాడేందుకు… ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ చందనం రవాణా, ఎగుమతులను నిషేధించింది. మన దేశంలో ఎర్ర చందనం వినియోగం అంతగా లేకున్నా…. విదేశాల్లో ప్రత్యేకించి చైనా, జపాన్‌ దేశాల్లో ఈ కలపతో చేసిన పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. మన ప్రభుత్వం ఎలాగూ సరఫరా చేయదు. అందుకే అక్కడివారు.. స్మగ్లింగ్‌ పైనే ఎక్కువగా ఆధారపడతారు. డిమాండ్‌ ను సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు.. ప్రాణాలకు తెగించి ప్రయత్నిస్తుంటారు. విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం.. విస్తీర్ణం ఎక్కువగా ఉండటం మూలంగా అటవీశాఖ స్మగ్లింగ్‌ ను అరికట్టలేకపోతోంది. స్మగ్లింగ్‌ ముఠా నాయకులు.. తమిళనాడు నుంచి కూలీలను తెప్పించుకుంటూ పెద్ద మొత్తంలో కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. కూలీలకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెపుతున్నారు. రోజు కూలీ వేల రూపాయల్లో ఉండటం వల్ల.. ఈజీ మనీకి అలవాటు పడిన కూలీలు.. ప్రాణాలకు అపాయమని తెలిసినా తెగిస్తున్నారు. అందులోనూ వారు గుంపులు గుంపులుగా వస్తుండటం వల్ల అటవీ అధికారులు ఎదురైనా ఎలాగోలా తప్పించుకోవచ్చన్న ధీమా వారిలో పెరిగింది. చివరకు పట్టుబడతామన్న భయం కలిగినప్పుడు మూకుమ్మడిగా అధికారులపై పడి.. వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. కొన్ని నెలల క్రితం ఓ అటవీ అధికారితో పాటు గార్డునూ స్మగ్లరు కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ముఠా పెద్దలు మారణాయుధాలు, తుపాకులు ఇచ్చి మరీ చందనం వేటకు పంపుతున్నారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి కలప ముందుగా చెన్నైకి ఆ తర్వాత పలు మార్గాల్లో విదేశాలకూ తరలిపోతోంది. ఇలా చందనం స్మగ్లింగ్‌ వ్యవహారం అటు పోలీసు శాఖకు.. ఇటు అటవీశాఖకు పెద్ద తలనొప్పిగా తయారైంది. దీనికి తోడు అరుదైన వృక్షజాతికావడం వల్ల ఏర్పరచిన నిబంధనలు.. అసలే ఎసరు తెస్తున్నాయి. ప్రభుత్వం స్మగ్లర్లపై దాడులు చేసి పట్టుకున్న కలప ఇప్పటికే కొన్ని వేల టన్నులు మూలన పడి మూలుగుతోంది. దీన్ని వేలం వేసి అమ్మాలని నిబంధనలు ఉన్నాయి. అయినా ఈ ఎర్రచందనం వేలానికి సంబంధించిన చొరవ తీసుకునే తీరిక, ఓపిక ప్రభుత్వాలకు లేవు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే.. ఇప్పటివరకూ పట్టుబడిన ఎర్రచందనం కలప 20 వేల టన్నులకుపైగా.. గోదాముల్లో మగ్గుతోంది. దీని విలువ… అధికారిక లెక్కల ప్రకారమే 50 వేల కోట్ల రూపాయలు. ఇదే చందనం విలువ స్మగ్లర్లు అమ్ముకునే లెక్కల ప్రకారం… దీనివిలువ 2 లక్షల కోట్ల రూపాయల పైమాటే.. ఇక ఇప్పటికే అధికారుల కళ్లుగప్పి విదేశాల బాట పట్టిన కలప సంగతి లెక్కేలేదు.. ఇక అటవీశాఖ సిబ్బంది కొరతతో పాటు.. ఆయుధాల కొరతతోనూ సతమతమవుతోంది. స్మగ్లర్లు మారణాయుధాలతో వస్తుంటే.. వారిని అడ్డుకునే పోలీసుల దగ్గర తుపాకులు కూడా ఉండటం లేదు. ఇటీవల ఇద్దరు అటవీ అధికారులను స్మగ్లర్లు పొట్టనపెట్టుకున్న తర్వాత.. అటవీ,పోలీసు శాఖలు కాస్త స్పందించి.. పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కోణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2004 ఎన్నికల ముందు జరిగిన అలిపిరి హత్యాయత్నం కేసులో నిందితుడైన గంగిరెడ్డిని అణగదొక్కేందుకే ఎన్‌ కౌంటర్‌ జరిగిందనేది ఒక వాదన. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలియగానే… అలిపిరి కేసు నిందితుడు గంగిరెడ్డి ప్రాణభయంతో అజ్ఞాతంలోకి జారుకున్నాడు. చంద్రబాబు సీఎం కానుండటంతో అర్జంటుగా ఆ గంగిరెడ్డిని పట్టుకుని బొక్కలో పెట్టాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లిపోయాయి. గతంలోనూ చందనం స్మగ్లర్లతో లింకులున్న గంగిరెడ్డి కోసం పోలీసులు రేయింబవళ్లు వెదికి చివరకు దుబయ్‌లో పట్టుకున్నారు. అతని అనుచరులు స్మగ్లింగ్‌కు పాల్పడకుండా పోలీసులు కూంబింగ్‌ చేస్తున్న నేపథ్యంలోనే ఎన్‌ కౌంటర్‌ జరిగందని తెలుస్తోంది. తమిళ కూలీల ఆకలి కేకలు.. ఈ మొత్తం వ్యవహారంలో ఉపాధి కోసమో… నాలుగు డబ్బులు సంపాదించుకుందామనో… తమిళనాడు నుంచి వస్తున్నకూలీలు బలవుతున్నారు. అసలు దొంగలైన ముఠా యజమానులు బాగానే ఉంటున్నారు. కూలీలు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి కలప అక్రమరవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళనాడులో అత్యంత పేదలను లక్ష్యంగా చేసుకుని డబ్బాశ చూపి..ఈ రొంపిలోకి దించుతున్నారు స్మగ్లరు దుర్మార్గులు.. వీరు కూడా గుంపులు గుంపులుగా రావడమే కాకుండా.. అడవిలో వంట కోసం సామగ్రి కూడా వెంటతెచ్చుకోవడం విశేషం. వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి అటవీసిబ్బందే వీరిని చూసి ప్రాణభయంతో పారిపోవాల్సిన దుస్థితి. స్మగ్లర్ల చేతిలో దెబ్బలు తిన్నామని.. కొందరు అటవీ సిబ్బంది విూడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. విచ్చలవిడిగా జరుగుతున్న కలప అక్రమ రవాణాను అడ్డుకునేది చాలా తక్కువ. అందులో దొరికిన కొంత మందిపైనా పకడ్బందీగా కేసులు పెట్టకపోవడం.. అటవీ చట్టాల ప్రకారం.. వారికి పెద్దగా శిక్షలు పడకపోవడం.. వెంటనే బెయిల్‌ వస్తుండటం వంటి కారణాలతో స్మగ్లర్లలో దీమా పెరిగింది. ఆ.. దొరికినా ఏమవుతుందిలే.. 3,4 నెలల్లో యజమాని బెయిల్‌ పై మళ్లీ బయటకు తెస్తాడు. తన కుటుంబాన్ని ఆదుకుంటాడు అన్న దీమాతో స్మగ్లర్లు, కూలీలలో భయం పోయింది. పోలీసులు కూడా దొంగలు దొరికినప్పుడు విూడియా ముందు ప్రవేశపెట్టడం దుంగలను స్వాధీనం చేసుకోవడం, కేసు పెట్టడం వరకూ బాగానే చేస్తున్నా.. ఆ తర్వాత.. నేరస్తులకు శిక్ష పడేంత వరకూ న్యాయపోరాటం చేయడంపై దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల.. స్మగ్లర్లకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకూ ఈ కలప అక్రమ రవాణాపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు కూడా పెట్టేవారు కాదు. ఈ మధ్యనే నిబంధనలను కఠినతరం చేశారు. రాజకీయ కోణం ఉందా..? నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలోని అటవీ ప్రాంతంలోని స్థానిక నేతలు ఈ స్మగ్లింగ్‌ ముఠాలతో చేతులు కలిపి కోట్లు సంపాదిస్తున్నారు. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనే బేధభావాలు ఏమాత్రం లేవు. స్మగర్ల దగ్గర పెద్ద మొత్తాల్లో అడ్వాన్సులు తీసుకోవడం.. కూలీలను మాట్లాడి చెట్లు కొట్టించడం. మూడో కంటికి తెలియకుండా సంకేత ప్రాంతాలకు చేరవేయడం చేస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఒక అటవీ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఒక రేంజర్‌, 8 మంది గార్డులు మాత్రమే ఉండటం వల్ల… వీరి ఆటలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వాలు మారిన పోలీసు పెద్దలు మారినా.. స్థానిక నేతల తీరులో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకోవట్లేదు. అయితే కొత్త ప్రభుత్వం దీన్నోప్రాధాన్య అంశంగా గుర్తించింది. స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అడ్డుగా ఉండే నిబంధనలను సడలించింది. స్మగ్లర్లను అరికట్టేందకు పోలీసు సిబ్బందిని అధికంగా నియమించింది. దీంతో కూంభింగ్‌ నిర్వహించిన పోలీసులకు అమాయక కూలీలు చిక్కారు. నిర్ధాక్షిణ్యంగా 20 మంది కూలీలు బలయ్యారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అమాయక కూలీలకు బదులు అసలు దోషులు దొరుకుతారు. అసలు దోషులను పట్టుకుంటే స్మగ్లింగ్‌ ముఠాలను వెనకుండి నడిపిస్తున్నదెవరనేది తేలుతుంది. పెద్దల సభల్లో దర్జాగా పదవులు వెలగబెడుతున్న చందనం స్మగ్లర్ల దందాగిరీ బట్టబయలవుతుంది. గుడిసెల్లో బతికే అమాయక జనాన్ని బలితీసుకోవాల్సిన అగత్యం రాకుండా ఉంటుంది.