గుడ్డిగా కోహ్లీని ఫాలో కావద్దు

– టాటూలు వేసుకోని వారు కూడా మ్యాచ్‌లు గెలిపిస్తారు

– క్రీడాకారులకు లెజెండరీ క్రికెటర్‌ ద్రావిద్‌ సూచన

బెంగళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఒంటి నిండా టాటూలు.. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే తీరు.. ఇదీ ఈ మధ్య ఇండియన్‌ టీమ్‌లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్‌. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్టెల్‌నే చాలా మంది ప్లేయర్స్‌ ఫాలో అయిపోతున్నారు. అయితే అది సరికాదని లెజెండరీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సూచించాడు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌లు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, ప్రేమ్‌ పానికర్‌తో రాహుల్‌ చిట్‌చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లి గురించి ద్రవిడ్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒంటి విూద టాటూలు వేసుకోని వారు కూడా మ్యాచ్‌లు గెలిపిస్తారని, గేమ్‌ అంటే కేవలం పర్ఫార్మెన్సే అని ద్రవిడ్‌ అన్నాడు. రాక్‌స్టార్‌లాగా కనిపించినంత మాత్రాన మ్యాచ్‌లు గెలవలేమని స్పష్టంచేశాడు. మ్యాచ్‌లు, సిరీస్‌లకు ముందు కొన్నిసార్లు విరాట్‌ చేసే కామెంట్స్‌ తనను భయపెడుతాయని ద్రవిడ్‌ అన్నాడు. అయితే ఇలా మాట్లాడితేనే, దూకుడుగా ఉంటేనే అతనిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని అనుకుంటే కోహ్లి ఇలాగే ఉండొచ్చని మిస్టర్‌ డిపెండబుల్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ఫీల్డ్‌లో కాస్త నోటికి కూడా పని చెప్పేవాళ్లు అవసరమే అని కోహ్లిని డిఫెండ్‌ చేశాడు ద్రవిడ్‌. అయితే కొత్త తరం క్రికెటర్లు మాత్రం గుడ్డిగా విరాట్‌ కోహ్లిని ఫాలో కావద్దని హెచ్చరించాడు. విరాట్‌, ధోనీలకు క్రికెట్‌ను మించి పేరు రావడం, కోచ్‌లను డిసైడ్‌ చేసే సామర్థ్యంపై కూడా ద్రవిడ్‌ స్పందించాడు. కుంబ్లేను సాగనంపడంపైనే పరోక్షంగా ఈ ప్రశ్న అడగడంతో ద్రవిడ్‌ కూడా ఆ అంశంపైనే మాట్లాడాడు. కుంబ్లేలాంటి లెజెండ్‌ను అలా పంపించడం దురదృష్టకరం. అదే సమయంలో కోచ్‌లపై ఇలా వేటు వేయడం సాధారణమే. నేను కూడా అండర్‌ 19 కోచ్‌గా ఉన్నాను. నా పైనా వేటు వేయొచ్చు అని ద్రవిడ్‌ అన్నాడు. ఇక సెలక్టర్లు టీమ్‌లోకి ఎంపిక చేసినంతవరకు ధోనీ ఇండియాకు ఆడొచ్చని, రిటైర్మెంట్‌ అతని ఇష్టమని ద్రవిడ్‌ స్పష్టంచేశాడు.