గుర్తుండిపోయే విజయం :మన అమ్మాయిలే.. ‘ఛాంపియన్స్‌’



spo

సింగపూర్‌: భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. లీగ్‌దశలో చివరి మ్యాచ్‌లో చైనా చేతిలో భంగపాటుకు ప్రతీకారం తీర్చుకొన్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠ వూపేసిన మ్యాచ్‌లో ఒత్తిడి చిత్తుచేస్తున్నా ఆఖరి 20 సెకన్లలో గోల్‌ చేసి ‘ఆసియా మహిళా ఛాంపియన్స్‌ ట్రోఫీ’ని దేశానికి అందించారు. దాయాది పాకిస్థాన్‌పై గెలిచి పురుషులు దీపావళి కానుకగా రెండోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకోగా శనివారం మహిళలూ ‘ఛాంపియన్స్‌’గా నిలిచి ఆ ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఏస్‌ స్ట్రైకర్‌ దీపిక ఆఖరి నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ను 2-1తో గట్టెక్కించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఒకే ఏడాదిలో భారత హాకీ పురుషులు, మహిళలు ఆసియా ట్రోఫీ గెలవడం ప్రత్యేకం.

గుర్తుండిపోయే విజయం 
ప్రథమార్థంలో చైనాపై భారత్‌ ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్‌లో లభించిన పెనాల్టీకార్నర్‌లో దీప్‌గ్రేస్‌ ఎక్కా గోల్‌ చేసి 1-0తో డ్రాగన్‌ జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. అయితే ద్వితీయార్థం ప్రారంభంలోనే చైనా పుంజుకొంది. జాంగ్‌ మెన్జ్‌లింగ్‌ (44 ని) ఫీల్డ్‌గోల్‌ కొట్టి 1-1తో స్కోర్‌ సమం చేసింది. అప్పట్నుచి రెండు జట్లు గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మ్యాచ్‌ 20 సెకన్లలో ముగుస్తుందనగా భారత్‌కు వచ్చిన పెనాల్టీ కార్నర్‌లో దీపిక చూడచక్కని షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టింది. దీంతో ఉత్కంఠ పోరులో టీమిండియా విజయ దుందుభి మోగించింది.