గెలిచే సత్తా లేక పాత కేసులు తోడుతున్నారు

కెసిఆర్‌తో తెలంగాణలో సామాన్యులకు స్థానం లేదు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షిఎ): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడి, అక్రమ కేసులుపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కొందరు అధికారులు అధికార తెరాస పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూనీ నిలబెట్టుకోని కేసీఆర్‌ ఇప్పుడు నిస్సిగ్గుగా మరోసారి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఆ కేసులో అసలు నిందితులు కేసీఆర్‌, హరీశ్‌రావులేనని ఆరోపించారు. రాజకీయంగా అణిచివేసేందుకే 13 ఏళ్ల తర్వాత కేసుతో సంబంధంలేని జగ్గారెడ్డిని జైలుకు పంపించారన్నారు. రేవంత్‌కు నోటీస్‌ ఇవ్వడంలోనూ అదే కుట్ర ఉందన్నారు. ఇలాంటి కుట్రలతో ప్రజల్లో సానుభూతి పొందలేరని అన్నారు. నాలుగేళ్ల పాలనలోనే నిరంకుశంగా వ్యవహరించిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని అన్నారు. మరోసారి అధికారం అప్పగిస్తే తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండదని హెచ్రించారు. రాబోయే ఎన్నికలు తెరాస- కాంగ్రెస్‌కు మధ్య కాదని…కేసీఆర్‌ కుటుంబానికి- తెలంగాణ సమాజానికి మధ్య జరుగుతున్నవని తెలిపారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పాత ఇందిరమ్మ ఇళ్లకు రూ.2లక్షలు, పెండింగ్‌ బకాయిల విడుదల, మెగా డీఎస్సీ తదితర హావిూలకు కట్టుబడి ఉంటామన్నారు. మోదీతో రహస్య ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్నారని ఆరోపించారు. తెరాస సర్వే బూటకంటూ ఆ పార్టీ వంద సీట్లు కాదుకదా పది సీట్లు గెలవడం కూడా గగనమేననివ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికల్తో తెరాస నిండా మునుగుతుందన్నారు.