గోల్కొండ కోటపై 17న జెండా ఎగరేయాలి

జిల్లాలో తామే ఎగురేస్తామన్న బిజెపి నేతలు
నల్లగొండ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17ను రాష్ట్రప్రభుత్వం విమోచన దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని బిజెపి  జిల్లా అధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 17న గ్రామ, బూత్‌, మండల కేంద్రాలలో జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. విమోచనపై  గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు.  తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో  ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు.  కేవలం ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్‌ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని అన్నారు.   అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలకు ఇచ్చిన హావిూని మరచారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎంఐఎంకు తలొగ్గి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్‌-17న నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గోల్కొండ కోటపై సెప్టెంబర్‌-17న జాతీయ జెండా ఎగురవేయాలని డిమాండ్‌ చేశారు. విమోచన దినంపై
తెరాస ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు భాజపా, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అన్ని హావిూలను మరచినట్లుగానే దీనిని మరిస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు.