గోవా క్యాంపులో టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు

 

ఉన్నవారిని కాపాడుకునేయత్నాల్లో కాంగ్రెస్‌

లెఫ్ట్‌ మద్దతు ఎవరికన్న దానిపై ఉత్కంఠ

ఖమ్మం,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ వైఖరి ఏంటన్నది ఒక చర్చ. ఆ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోయినా.. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న తాతా మధు.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుల పూర్వ రాజకీయ వాసనలు కమ్యూనిస్ట్‌ పార్టీలోనే ఉన్నాయి. పాత స్నేహాలు గుర్తొచ్చి వీళ్లలో ఎవరికైనా మద్దతిస్తారా? లేక ఒకరికే జై కొడతారా? లేక తటస్థంగా ఉండే సాహసం చేస్తారా అన్నది రాజకీయ వర్గాల అనుమానంగా ఉంది. మరోవైపు  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీ గోవాలో ఏర్పాటు చేసిన శిబిరంలో స్థానిక ప్రజాప్రతినిధులు సేదదీరుతున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా అక్కడికి వెళ్లారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహం, పెట్టుబడుల సేకరణపై రూపొందిం చాల్సి విధివిధానాలపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం గోవా వెళ్లిన మంత్రి పువ్వాడ.. ఆదివారం సమావేశం ముగిసిన అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధు లున్న శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ వారితో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో వివరించారు. ఇవి సాధారణ ఎన్నికల ఓటింగ్‌లా ఉండవని, ప్రాధాన్యతా ఓట్ల ప్రకారం లెక్కింపు ఉంటుందని అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పూర్తి మెజారిటీ వచ్చేలా చేయాలని మంత్రి కోరారు. అయితే మంగళవారం నుంచే ప్రజా ప్రతినిధులను విడతల వారీగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే విషయమై సమావేశంలో చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ పార్టీలు బలంగా ఉండేవి.  తాజాగా ఉనికి కాపాడుకోవడానికి గట్టిపోరాటమే చేస్తున్నాయి. బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులిద్దరూ లెప్ట్‌ పార్టీల మద్దతు కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గతంలో సీపీఎంలో ఉన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు తాతా మధు. ఆ జిల్లా మంత్రి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మధును వెంటబెట్టుకుని తన తండ్రి, వామపక్ష నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు దగ్గరకు తీసుకెళ్లి మద్దతుకోరారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సైతం సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత పీఆర్పీ.. ఆపై కాంగ్రెస్‌లోకి వచ్చారు. నాగేశ్వరరావు కుటుంబసభ్యులు సీపీఎంలో ఇంకా కొనసాగుతున్నారు. అందుకే ఇద్దరూ పాత కామ్రేడ్ల మద్దతు ఆశించారు. వాస్తవానికి జిల్లాలో ఏడు వందల పైచిలుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ బలం దాదాపు ఐదొందలు పైనే. కాంగ్రెస్‌ ఓటర్లు వంద నుంచి నూట ఇరువై ఉండొచ్చని ఒక అంచనా. ఇక కామ్రేడ్ల బలం సీపీఐ 34, సీపీఎం 26. బలాబలాల పరంగా కాంగ్రెస్‌ చాలా వెనకబడి ఉంది.  కాంగ్రెస్‌ క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకోవడంతో ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది.ఎందుకైనా మంచిదని ఓటర్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించేశారు. ఇటు కాంగ్రెస్‌ కూడా తమ ఓటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఈ సమయంలో ఎవరు ఎటు జారిపోయినా.. లెప్ట్‌ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కీలకంగా భావిస్తున్నాయి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌. తమ పార్టీ ఓటర్లనుఈ సమయంలో ఏ విధంగా చూసుకుంటున్నారో.. అదే విధంగా లెప్ట్‌ పార్టీ ఓటర్లను గౌరవిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానిక రాజకీయ పరిస్థితులు.. సవిూకరణాలు.. పార్టీ అవసరాలకు అనుగుణంగా కామ్రేడ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. “