గౌరవెల్లికి తొలిగిన అడ్డంకులు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు స్టే ఎత్తేయడంతో భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్చందంగా తరలివస్తున్నారు. గూడాటి పల్లి గ్రామానికి చెందిన వంద మంది రైతులు తమ భూములు ఇవ్వడానికి హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్‌ నేతల కేసుల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు భూములు అప్పగించిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దగ్గరుండి వారికి సహాయం అందించారు.

నల్లవాగు ఆధునీకరణకు నిధులు

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. రూ. 24.14 కోట్ల వ్యయంతో నల్లవాగు ఆధునీకరణ పనులకు పరిపాలన పరమైన అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కింద సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలోని మొత్తం 13 గ్రామాల్లో 6030 ఎకరాల ఆయకట్టు సాగు అవుతుంది.