గ్రామాల్లో మొదలైన పంచాయితీ సందడి

తొలిదశ నామినేషన్ల గట్టానికి తెర

పన్ను బకాయిలు, బెయిల్‌ ఉన్నా అనర్హులే

నేరచరిత్రను ముందే వెల్లడించాలి

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): పంచాయితీల్లో ఎన్నికల సందడి మొదలయ్యింది. మొదటి దశ పోలింగ్‌కు సంబధించి జిల్లాల్లో నామినేషన్ల ఘట్టం ప్రాంభం అయ్యింది. దీంతో గ్రామాల్లో హడావిడి కనిపించింది. ఇప్పటికే పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు తమ నామినేషన్లను వేసేందుకు దరఖాస్తులను నింపుతూ కనిపించారు. ఇకపోతే ఇఇప్పటి వరకు ఏకగ్రీవ పంచాయతీలను ఆయా రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించేది. ఇకపై వారికి అర్హత లేకుండా కలెక్టర్‌ ఏకగ్రీవ పంచాయతీలు దరఖాస్తు చేసుకుంటే, ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ప్రకటిస్తారు. ఏకగ్రీవం కోసం గ్రామాల్లో ఎలాంటి వేలాన్ని నిర్వహించినా, ఆ విషయం కలెక్టర్‌ దృష్టికి వచ్చినా ఏకగ్రీవాన్ని రద్దుచేయవచ్చు. దాంతో పాటు జైలు, జరిమానా, అనర్హత వేటు తప్పదు. అలాగే నామినేషన్ల పక్రియ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలుగు

అక్షరమాల ప్రకారం గుర్తులను కేటాయించనున్నారు. అలాగే ఈ నెలలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటాను ఓటర్లు వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు అందరి వరుస క్రమం పూర్తయ్యాక, చివరి వరుసలో బ్యాలెట్‌ పేపరుపై నోటా ఆప్షన్‌ పెట్టనుంది. ఇలా అనేక రకాల నియమాలు, నిబంధనలు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పాటించాల్సి ఉంటుంది. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ పాటు ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ పత్రం జతచేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. సాక్షులుగా సంతకం చేసే వారి చిరునామా స్పష్టంగా పేర్కొనాలి. నామినేషన్‌ స్వీకరించిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి వాటిని గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్‌ పెడతారు. అభ్యర్థులు తప్పుడు సమాచారం అందించినా, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. వాటిని పరిశీలించాక నియమావళి ప్రకారం లేకపోతే తిరస్కరించే అవకాశం ఉంది. నేరచరిత్రను వెల్లడించినట్లే ఇకపై పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే వారు సైతం పూర్తి వివరాలను తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పొందుపరచడంతో పాటుగా విద్యార్హత పత్రాలు జత చేయాలి. అందుకు సంబంధించి అభ్యర్థులు ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటన్నింటిలో ఏ ఒక్కటి లేకున్నా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. ఐపీ పెట్టినా, ఐపీకి దరఖాస్తు చేసుకున్నా ఆ వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్‌ కోర్టు దోషిగా నిర్దారించి, శిక్ష ఖరారు అయిన వారు, ఒక కోర్టు దోషిగా తేల్చిస్తే, హైకోర్టుకు అప్పీల్‌ చేసుకుంటే, ఆ కోర్టు స్టే ఇవ్వకుండా బెయిల్‌ విడుదల అయినా పోటీకి అవకాశం లేదు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలియజేయకపోతే ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా పరిగణించి నామినేషన్ల పరిశీలన సమయంలో రిటర్నింగ్‌ అధికారి భేషరతుగా నామినేషన్‌ తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేసింది. మూడో సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన ఆశావహుల్లో ఆశనిపాతంగా మారింది.