గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

 మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట, జూన్‌18(జ‌నం సాక్షి) : గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. యండ్లపల్లి గ్రామంలో రూ. 15 లక్షలతో చేపట్టబోయే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 20 లక్షల అంచనా వ్యయంతో ఎన్‌ఆర్‌ఐ నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 208.50 లక్షలతో మూసీ ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యండ్లపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది రూ. 16 కోట్లు అని తెలిపారు. ఒక్క పింఛన్ల పేరు విూదనే ఈ గ్రామానికి నెలకు రూ. 7 లక్షల చొప్పున ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది రూ. 2 కోట్ల 52 లక్షలు అని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల అభివృద్ధి విస్మరించారని, తెరాస ప్రభుత్వం హయాంలో నాలుగేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. దీనికితోడు కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో సర్పంచ్‌లు, పాలక సభ్యులకే గ్రామాల అభివృద్ధి బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రామాలను మరింత అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరస్కరిస్తారనే భానతో ప్రభుత్వ పథకాలపై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ పాలన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వక్ర బుద్దితో విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన తీరు మార్చుకోకుంటే తెలంగాణలో పార్టీల అడ్రస్సులు గల్లంతు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.