గ్లౌజులు ధరించేందుకు ముందే ఐసీసీ అనుమతి కోరాం

– ధోనీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ
ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వేసుకున్న గ్లౌజుల విషయంపై బీసీసీఐ మద్దతుగా నిలిచింది. నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరాదని, బలిదాన్‌ గుర్తులు గల గ్లౌజులను ధోనీ ధరించకూడదని ఐసీసీ ఇప్పటికే బీసీసీఐకి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ధోనీ ఆ గ్లౌజులు ధరించేందుకు ఇంతకుముందే ఐసీసీ అనుమతి కోరామని బీసీసీఐ పాలకవర్గ చీఫ్‌ వినోద్‌రాయ్‌ పేర్కొన్నారు. ఐసీసీతో సమావేశం తర్వాత ఈ విషయంపై మరింత మాట్లాడతామని ఆయన తెలిపారు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా మాట్లాడుతూ ఈ అంశంపై ఐసీసీ అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదన్నారు. బలిదాన్‌ గుర్తులు కలిగిన గ్లౌజులను ధరించేందుకు ధోనీకి అనుమతివ్వాలని, ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవని, ఇది కేవలం జాతి గౌరవమని తెలిపారు. ఈ అంశంలో ఐసీసీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ క్లైర్‌ ఫర్లాంగ్‌ స్పందిస్తూ.. బీసీసీఐని ఆ గుర్తులను తొలగించాలని కోరామని చెప్పారు. అయితే బీసీసీఐ తెలిపిన వివరాలను అత్యున్నత స్థాయికి తీసుకెళతామని, వాళ్లే తుది నిర్ణయం
తీసుకుంటారని వివరించారు. ఇదిలా ఉండగా భారత్‌లో ధోనీకి పెద్ద సంఖ్యలో అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.