ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి):  తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ తొలి  దేశీయ టీకాను రూపొందించిందని పేర్కొన్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించామన్నారు. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని గవర్నర్‌ స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసౌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతిని ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉద్యమ నాయకుడికే ప్రజలు ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో దృష్టికోణంలో పాలన సాగుతోందన్నారు. ఆరున్నరేళ్ల కృషి ఫలితంగా రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని గవర్నర్‌ తెలిపారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్లలె ప్రగతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 91 శాతం సంరక్షించామని చెప్పారు. 12 వేలకు పైగా డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కోసం ఏటా రూ. 148 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పట్టణాల్లో 2,802 పారిశుద్ధ్య వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 2,004 పారిశుద్ధ్య వాహనాలు అందిస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలు, జీహెచ్‌ఎంసీలో 500 నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 116 చోట్ల సవిూకృత మార్కెట్ల నిర్మాణం చేపడుతామన్నారు. 2021-22 బ్జడెట్‌లో సవిూకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 90 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. అన్ని పట్టణాల్లో ప్రతీ ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీరు అంందిస్తున్నామని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం నిలిచిందన్నారు. శరవేగంగా పాలమూరు – రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగు తోందని స్పష్టం చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి ద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అందుతుం దన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు 4 విూటర్ల మేర పెరిగాయన్నారు. నిరంతర విద్యుత్‌ ద్వారా 24 లక్షల పంపుసెట్ల కింద పంటలు పండిస్తున్నారు. కోటిన్నర ఎకరాల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. రాష్ట్రంలో వరి విస్తీర్ణం కోటి 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దేశానికి తెలంగాన అన్నపూర్ణగా మారిందన్నారు. దేశంలో 55 శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయన్నారు. రెవెన్యూ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ నూటికి నూరు శాతం విజయవంతం అయిందన్నారు. కరోనా సమయంలోనూ రైతుబంధు కొనసాగించామన్నారు. ఇప్పటి వరకూ రైతుబంధు ద్వారా రూ. 7,351 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇచ్చామన్నారు. పాలన సామర్థ్యానికి గీటురాయిగా విద్యుత్‌ విజయాలు సాధించామని స్పష్టం చేశారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కొనసాగుతోందని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 16,245 మెగావాట్లకు పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు చర్చించుకునేందుకు
వీలుగా రైతు వేదికల నిర్మాణం చేపట్టామని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.  మునుపెన్నడూ లేని విధంగా కొత్త పథకాలను, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలుచేస్తూ అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమని తెలుగులో ముగింపు వచనాలు పలికారు.