ఘనంగా మహాత్ముడి జయంతి వేడుకలు

నివాళి అర్పించిన గవర్నర్‌, సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముడికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లంగర్‌ హౌస్‌ లో బాపూఘాట్‌ వద్ద ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌, గవర్నర్‌ నరసింహాన్‌, మాజీ సభాపతి మదుసూధనచారి, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేతలు పుష్ఫాగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని వక్తుల పిలపునిచ్చారు. సంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఆకట్టుకున్నాయి. మహాత్మ గాంధీ కలలు కన్న పరిపాలన తెలంగాణలో కొనసాగుతోందని మాజీ శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. బాపూజీ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో రామరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి స్పీకర్‌ పుష్పాంజలి ఘటించారు. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన మధుసూదనాచారి తొలుత ఆవరణలోని అబేంద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఆనంతరం గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని మహాత్ముడికి అంజలి ఘటించారు.