చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం


` 35 స్థానాల్లో 14 చోట్ల గెలుపు
` ఇది ట్రైలర్‌ మాత్రమేనన్న ఆమ్‌ఆద్మీ
చండీగఢ్‌,డిసెంబరు 27(జనంసాక్షి): పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) సత్తా చాటింది. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో ఆప్‌ విజయం సాధించింది. శుక్రవారం ఎన్నికలు జరగగా సోమవారం కౌంటింగ్‌ నిర్వహించారు. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 35 స్థానాలు ఉండగా.. ఆప్‌ 14 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 12 స్థానాలు, కాంగ్రెస్‌ 8 స్థానాలకు పరిమితమయ్యాయి. శిరోమణి అకాలీ దళ్‌ ఒకే స్థానంతో సరిపెట్టుకుంది. చండీగఢ్‌ సిట్టింగ్‌ మేయర్‌ రవికాంత్‌ శర్మ(భాజపా)ను ఆప్‌ అభ్యర్థి దమన్‌ప్రీత్‌ సింగ్‌ 828 ఓట్ల తేడాతో ఓడిరచడం గమనార్హం. మాజీ మేయర్‌, భాజపా అభ్యర్థి దావేశ్‌ మౌడ్గిల్‌పై ఆప్‌ అభ్యర్థి జస్బీర్‌ 939 ఓట్ల తేడాతో గెలుపొందారు.మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయంపై ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘పంజాబ్‌?లో మార్పునకు ఇది సంకేతం. అవినీతి రాజకీయాలను ప్రజలు తిరస్కరించి ఆప్‌ని ఎన్నుకున్నారు. మాలాంటి చిన్న, నిజాయితీ గల పార్టీపై ఇంతటి ప్రేమ, నమ్మకాలను చూపించినందుకు ఆప్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున చండీగఢ్‌ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ రాజకీయాలపై దృష్టిసారించిన ఆప్‌కు దక్కిన మొదటి విజయం ఇది. గెలుపుపై ఆప్‌ నేతలు స్పందిస్తున్నారు. ‘చండీగఢ్‌ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే.. పంజాబ్‌? ఎలక్షన్లు అసలైన సినిమాను చూపిస్తాయి’ అని ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్ధా పేర్కొన్నారు. పంజాబ్‌?లో తమ పార్టీకి ఘనమైన స్వాగతం లభించిందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సంతోషం వ్యక్తం చేశారు.