చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు

– త్వరలో టీడీపీలో చేరే అవకాశం

– బాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

– వైసీపీలో పారదర్శకత లేకనే రాజీనామాచేశా

– త్వరలో రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన చేస్తా

– విూడియాతో ఆదిశేషగిరిరావు

అమరావతి, జనవరి24(జ‌నంసాక్షి) : వైసీపీకి రాజీనామా చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అడుగులు టీడీపీవైపు పడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆదిశేషగిరిరావు కలిశారు. అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.. త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీలో పారదర్శకత లేకపోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో విధివిధానాలు నచ్చకనే పార్టీ నుంచి బయటపడ్డానని చెప్పారు. సీఎం చంద్రబాబు చేస్తున్న చేస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు, డ్వాక్రామహిళల కోసం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని అభినందించినట్లు చెప్పారు. అందుకోసమే మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు వెల్లడించారు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ మద్దతు లేకుండా తాను ఏ పని చేయనని, ఏ నిర్ణయాలు తీసుకోనని ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు.. బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. 30ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగానని.. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేశానన్నారు. వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవని, కేవలం వైసీపీలో విధివిధానాలు నచ్చని కారణంగా పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.