చంద్రబాబును నమ్మకుంటే నట్టేట మునిగినట్లే


కరెంట్‌ కష్టాలకు ఆయనే ఆద్యుడు
మహాకూటమితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు
ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నిర్మల్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): చంద్రబాబు హాయంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవించారని, వ్యవసాయానికి కరెంట్‌ ఇవ్వని బాబు విూటర్లను ,స్టార్టర్లను తొలగించి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసాడని  టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అదే చంద్రబాబు ఇవాళ మహకూటమి పేరుతో వచ్చి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు.  ఎందరో మంది ప్రాణత్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు,కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేస్తే భావి తరాలు ఎంతో నష్టపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాకే తండాలకు రాజ్యాధికారం దక్కడంతో పాటు తండాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చేసి చూపిస్తానని చెప్పారు. గురువారం సారంగాపూర్‌ మండలంలోని పలు గ్రామాలు, తాండాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో పర్యటించిన అల్లోలకు ప్రతీ గ్రామంలో ఆడపడుచులు మంగళహారతులతో  ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… లంగాణలో కడుతున్న ప్రాజెక్ట్‌లను ఆపే కుట్రలు జరుగుతున్నా యని, ఆ కుట్రలను తిప్పికొట్టి టీఆర్‌ఎస్‌ కే ఓటు వేయాలని కోరారు. తండాలను పంచాయతీలుగా చేయాలని ఏండ్లుగా పోరాటం చేసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారని అన్నారు. తండాల్లో పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తుందని, మౌలిక వసతుల కోసం తండాలకు రూ.30 లక్షలను విడుదల చేస్తుందని ఈ నిధులతో తండాల్లో అభివృద్ది చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు గడపగడపకు చేరాయన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు. రైతులు పెట్టబడి కోసం అప్పులు చేయొద్దనే సంకల్పంతో రైతుబంధును ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేళ్లలోనే 67 సంవత్సరాల అభివృద్ధి సాధించారన్నారు. ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వంత స్థలం ఉన్న ప్రతీ ఇంటికి డబుల్‌ బెడ్రూంలు కట్టిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను రెట్టింపు చేసి వృద్ధులు, వితంతువులకు రూ.2,016.. వికలాంగులకు రూ.3,016.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3,016.. రైతుబంధు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి 10 వేలు ఇస్తామన్నారు. రైతు బీమా కోసం ఒక రైతుకు
రూ.2,300 చొప్పున వెయ్యి కోట్లు ప్రభుత్వమే బీమా కట్టించిందన్నారు. కాంగ్రెస్‌ అధికార దాహంతో అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలను వల్లేవేస్తుందని, ప్రజలు కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలను నమ్మకుండా, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న పార్టీని ఎన్నుకొని తెలంగాణ అభివృద్ధి కొనసాగింపుకు మరింత చేయూత ఇవ్వాల్సిందిగా మంత్రి కోరారు. మాయాకూటమిని నమ్మితే మళ్లీ మోసపోతామని అన్నారు. అందరూ కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని అన్నారు.