చంద్రబాబుపై మండిపడ్డ దగ్గుబాటి వెంకటేశ్వరరావు

అమరావతి(జ‌నం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్‌ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఓట్లు పొందవచ్చని.. అందుకోసమే ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే దీక్షలు చేయడం, ప్రజలను రెచ్చకొట్టడం కాకుండా పోలవరంపై  అనుమానాలు నివృత్తి చేసి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా లేకపోయిన 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు మళ్లీ కేంద్రాన్ని ఎందుకు నిధుల గురించి అడుగుతోందని ప్రశ్నించారు. వైజాగ్‌, చెన్నై కారిడార్‌కు భూ సేకరణ, వసతులు కల్పించకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తోందని విమర్శించారు. బీజేపీ ఏడు మండలాలను విలీనం చేయకపోతే పోలవరం సాధ్యం కాకపోయేదని ఆయనవ్యాఖ్యానించారు.

10 జాతీయ సంస్థలకు ఒకేసారి 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అసాధ్యం అన్నారు. రాజధాని కడతామని ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో చెప్పారని.. ఈ విషయంలో బీజేపీ వైఖరి బాగోలేదని అన్నారు. మోదీ మాటలను ప్రశ్నిస్తున్న టీడీపీకి.. ఎన్నికల సమయంలో వారిచ్చిన రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు గర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. పరిపాలన అంటే ప్రెస్‌ మీట్లు, దీక్షలు కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రెస్‌ మీట్ పెట్టడం వల్ల లాభమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్లకు 60వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెబితే ప్రభుత్వం డీపీఆర్‌లు ఇవ్వలేదని విమర్శించారు. విభజన బిల్లులో పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌లు కచ్చితంగా ఇస్తామని చెప్పలేదన్నారు.

చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవనా అంటూ ప్రశ్నించారని, దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావని అన్నారని మరోసారి గుర్తుచేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉచ్చులో చంద్రబాబు పడ్డారని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఓ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధి హామీ నిధులతో చంద్రన్న రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.