చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అనుమానం వస్తే కాల్ చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు అని సూచించారు. అనుమానితులను చూడగానే స్థానికులు దాడులకు దిగుతున్నారని, అలా ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కాదని, సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నవారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, గ్రామాల్లో కూడా సీసీటీవీ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని యూనిట్లను అప్రమత్తం చేసామన్నారు. నిజామాబాద్‌ జిల్లా భీంగల్, బీబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఘటనల్లో దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు.