చలో మల్లన్నసాగర్‌ ఉద్రిక్తం

C

– గాంధీభవన్‌ దిగ్భంధనం

– ఇనుప కంచెలను దూకిన కార్యకర్తలు

– నిరసన తెలిపే హక్కులేదా?

– పరామర్శించడం నేరమా?

– జైపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌,జులై 26(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన  ‘చలో మల్లన్నసాగర్‌’ యాత్ర ఉద్రిక్తంగా మారింది. గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్‌ అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు గాంధీ భవన్‌ నుంచి మల్లన్నసాగర్‌కు బయలుదేరారు. అయితే వీరు గాంధీభవన్‌ దాటకముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు యాత్రను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాసేపట్లో కాంగ్రెస్‌ నేతలు నాంపల్లిలోని గాంధీభవన్‌ నుంచి ‘చలో మల్లన్నసాగర్‌’ యాత్ర చేపట్టనున్నరనగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మల్లన్నసాగర్‌  బయలు దేరేందుకు కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్‌ నేతలు గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీ భవన్‌ వద్ద డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దీంతో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులు గత కొన్నిరోజులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఆదివారం మల్లన్న సాగర్‌ రైతులపై లాఠీఛార్జ్‌కునిరసనగా కాంగ్రెస్‌ ఈ యాత్రకు పిలుపునిచ్చింది. మల్లన్నసాగర్కు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని… అరెస్ట్‌ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో నేడు బ్లాక్‌డే  అని పార్టీ నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్క అభివర్ణించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలను గోషామహల్‌ స్టేడియంకు తరలించారు. ఆ క్రమంలో గాంధీ భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు… ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఛలో మల్లన్న సాగర్‌కు  పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్‌ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్‌ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతోపాటు తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ నేతలు పిలుపు నేపథ్యంలో  మెదక్‌ జిల్లాలో పోలీసులు 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాఅంతటా 144వ సెక్షన్‌ విధించారు. జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు మల్లన్నసాగర్‌ ప్రాంతానికి చేరకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అరెస్ట్‌ అయిన వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని , ప్రజలు ఎదిరించే రోజులు ముందున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. మల్లన్న సాగర్‌ రైఔతులపై దాడి అమానుషమన్నారు.  గతంలో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిచి ఏం సాధించావ్‌.. జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యావ్‌.. బాంచన్‌దొర నీ కాల్మొక్తా అంటూ కాళ్లకాడ పడి ఉంటారని అనుకుంటున్నావేమో.. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోతే తన్నే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిఅని ధ్వజమెత్తారు. ఎవరైనా భూమిని సర్వే చేసి ప్రాజెక్టులు చేపడతారని, ఈయనేమో గూగుల్‌లో చూసి ప్రాజెక్టులను కట్టడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. మాయమాటలు చెప్పి ప్రజాసంక్షేమం విస్మరిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని విమర్శించారు. ప్రభుత్వం మల్లన్నసాగర్‌ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తుందన్నారు.

ఎందుకీ నిర్బంధ కాండ

నిరసన తెలిపే హక్కు లేదా: జైపాల్‌ రెడ్డి

రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా? ఎందుకీ నిర్బంధం అని కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని అన్నారు.  మల్లన్నసాగర్‌ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడాన్ని కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మల్లన్నసాగర్‌కు వెళ్లనివ్వకుండా ఇంత నిర్బంధమా? అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌పై ప్రభుత్వ విధానం అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనబడటం లేదన్నారు. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్‌ నిర్మించాలని అనుకోవడం  అవసరమా అని నిలదీసిన ఆయన ప్రజలకున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తప్పులు బయట పడుతాయని టీఆర్‌ఎస్‌ భయపడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు రైతులను మోసం చేస్తున్నారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్‌ చేశారు. రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం సరికాదన్నారు. రైతులు, ప్రతిపక్షాలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయాలని జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎలాంటి చర్చ లేకుండా

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, రైతులను నట్టేట ముంచాలనుకోవడం సరికాదన్నారు. తాము నిరసన తెలిపితేనే ప్రభుత్వం వణికిపోతోందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం… కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్‌ మల్లన్నసాగర్‌కు  అవసరమా అని జైపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని జైపాల్‌ రెడ్డి హితవు పలికారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు… ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్‌కు  పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్‌ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్‌ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని, గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు  తరలించారు.