చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్‌

– కార్యకర్తల నినాదాల నడుమే స్టేషన్‌కు తరలింపు
ఏలూరు, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. అనుచరులతో సహా దుగ్గిరాలలో తన నివాసానికి వచ్చిన ఆయన్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య రాధను చూడటం కోసం ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్దకు చేరుకున్న చింతమనేని తండ్రి, పిల్లలను కలిసి కాసేపు మాట్లాడారు. తాను లొంగిపోతానని చెప్పినప్పటికీ.. పోలీసులు ఇంత హై డ్రామా ఎందుకు చేస్తున్నారని చింతమనేని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చింతమనేనిని బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించడానికి పోలీసులు యత్నించగా.. ఆయన తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా పోలీసులు తనను అరెస్టు చేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు మోపారని చింతమనేని వాపోయారు. న్యాయ పోరాటంలో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం చింతమనేనిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దుగ్గిరాలలోని ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తమ ఇంట్లో ఎలా సోదాలు చేస్తారని చింతమనేని తండ్రి పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తమను పక్కకు నెట్టేసి మరీ సోదాలు జరిపారని ఆయన సిబ్బంది ఆరోపించారు.