చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ

దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని రైతులు మధ్య దళారులకే విక్రయిస్తున్నారు. సిసిఐ నిబంధలను పత్తి

రైతులను పంట అమ్ముకునేలా చేస్తోంది. దీంతో పత్తి రైతు దిగులు చెందుతున్నాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గిందని ఓ వైపు ఆందోళన చెందుతుంటే మరోవైపు పంట కొనుగోళ్లు లేక కలవరపడుతున్నాడు. నిబంధనల పేరిట ప్రభుత్వరంగ సంస్థలు ఇబ్బంది పెడుతుంటే.. దళారులు ధర తగ్గించి పంట కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాల్లో దళారులది ఆడిందే ఆటగా మారింది. ప్రధానంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో పత్తిని ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది జిల్లాల్లో వేల హెక్టార్లలో రైతులు పత్తి పంట సాగు చేశారు. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. మొదట్లో పంట బాగానే ఉన్నా అకాల వర్షాల వల్ల పంట కొంత దెబ్బతింది. ఎడతెరపి లేకుండా 15 రోజుల పాటు వర్షం కురియడంతో పంట చేలల్లోనే నీరు నిలువగా, కొన్ని చోట్ల పత్తి నల్లబారింది. దీంతో లక్ష క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు.క్వింటాల్‌ పత్తికి రూ.5,550గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. పత్తి కొనుగోలులో అవకతవకలు జరుగకుండా ఉండాలనే ఆలోచనతో పత్తి సాగు చేసిన రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులను కూడా జారీ చేశారు. మధ్య దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సీసీఐలో ఎక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండాలనే ఆలోచనతో కొనుగోలు కేంద్రం వద్ద సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు అమ్మకానికి వచ్చిన రైతు ఆధార్‌ కార్డును సరిచూసి, ఐరిష్‌ కెమెరా ద్వారా వివరాలు సరిచూసి, వేలి ముద్ర తీసుకుని కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి.తక్‌పట్టీపై కూడా రైతు ఫొటో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అయినా తేమశాతం పేరుతో తిప్పిపంపడంతో రైతులు పత్తి అమ్మకాలు జరుగక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు నిబంధనలు పెట్టడంతో ఇప్పుడు ప్లలెల్లోకి దళారులు వచ్చి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.4 వేలు పెడుతూ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కూడా కొందరు తూకంలో మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల్లో ఇలా ఏ గ్రామానికి వెళ్లినా మధ్య దళారులు ఇలా రైతుల ఇంటికి వెళ్లి తక్కువ ధరకే నేరుగా పత్తి పంట కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా వ్యవసాయాధికారులుగానీ, మార్కెటింగ్‌ అధికారులుగానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా అధికారులు, నాయకులు చొరవ తీసుకుని పత్తి రైతును ఆదుకునేలా చర్యలు చేపట్టి మద్దతు ధర వచ్చేలా చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.