చిరస్మరణీయుడు మిమిక్రీ వేణుమాధవ్‌

మిమిక్రీ అనే కళను ప్రపంచానికి పరిచయం చేసి, దానిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ధీశాలి మన నేరెళ్ల వేణుమాధవ్‌ ధన్యజీవి. అంతటి మహానుభావుడు ఓ సామాన్యుడిలా మన కళ్లముందే నడయాడి మనలను వీడి వెళ్లారు. కానీ అందరిలా ఆయన వెళ్లలేదు. ఆయన ప్రేమించి,ప్రవచించిన మిమిక్రీని సజీవంగా మనకందించారు. ఇక అది నిరంతరాయంగా ప్రపంచంలో కొనసాగుతూనే ఉంటుంది. మిమిక్రీ ఉన్నన్నాళ్లూ నేరెళ్ల వేణుమాధవ్‌ మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటారు. వరంగల్‌ నుంచి ప్రారంభమైన నేరెళ్ల వేణుమాధవ్‌ మిమిక్రీ ప్రస్థానం ఐరాస వరకు వెళ్లిందంటే తెలుగువారిగా మనకన్న గర్వించేవారు ఉండరు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలోనే అమెరికాలో ప్రదర్శనకు అవకాశం రావడంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగినప్పుడు తెలుగువారి గుండెలు మరింత పులకించి ఉంటాయి. ఆనాటి ఘటనలు తలుచుకుంటే నేటికీ మనం పులకించకుండా ఉండలేం. ఓ కళను సృష్టించిన స్రష్ట ఆయన. దానిని శబ్దప్రక్రియగా ఓ సబ్జక్టుగా రూపొందించి భావి తరాలకు మార్గం చూపారు. అయినా పురాణాల్లోనే ఇలాంటి చాతుర్యం ఉందని, అదంత భగవత్‌ కృప అని చెప్పుకుని, తన గొప్పతనమేవిూ లేదని చెప్పుకోవడం ఆయన ఉదాత్తకు తార్కాణం. తనకు అబ్బిన మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ప్రదర్శనలుగా ఇవ్వడం ఒక ఎత్తయితే 1971లో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టినీ ఆకర్షించడం మరొక ఎత్తు. తన గొంతులో వెయ్యి గొంతుకలను పలికించడం ద్వారా మిమిక్రీ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కళాకారుడు తెలుగువాడయినందుకు… భారతీయుడైనందుకు మనమంతా గర్వపడాలి. పదో ఏటలోనే మిమిక్రీ కళపై మక్కువ పెంచుకున్న నేరెళ్ల తన ఆశయం మేరకు మిమిక్రీపైనే దృష్టి సారించి దానిని జగద్విఖ్యాతం చేయకుండా ఉండివుంటే ఇవాళ మిమిక్రీ అన్నది ప్రపంచానికి తెలిసేది కాదు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని వ్యాపారంలో స్థిరపడి ఉన్నా మనకు నేరెళ్ల వేణుమాధవ్‌ అంటే ఎవరో తెలిసేది కాదు. తనకు అభిరుచి ఉన్న ఆ రంగంలోనే ఎదగాలని నిర్ణయించుకున్నందునే ఆయన గొప్పవాడయ్యారు. ఆయన జీవితం ఓ పాఠం. ఆధునిక తరానికి ఓ సక్సెస్‌ స్టోరీ. ఇంటర్‌ చదివే రోజుల్లో తండ్రి చనిపోయి ఆర్థిక పరిస్థితులు తలకిందు లైనా చదువును వదలకుండా బీఏ, బీకాం, బీఈడీ పూర్తిచేయడంతో పాటు తాను నమ్ముకున్న మిమిక్రీని కూడా పూర్తి చేసిన పట్టభద్రుడాయన. నాగయ్య గొంతుతో పోతన పద్యాలు, పాటలు ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారు. భక్తపోతన చిత్రం ఆయనపై బలమైన ముద్ర వేసింది. పోతన పుట్టిన ఓరుగల్లులో పుట్టిన మట్టిబిడ్డగా వేణుమాధవ్‌ తన గళం బలంతో ప్రపంచాన్ని శాసించారు. తొలితరం నటుడైన చిత్తూరు నాగయ్య స్వరాన్ని అనుకరించడం ద్వారా తన కళా ప్రస్థానానికి బాటలు వేసుకున్నది మొదలు ఆయన గొంఉతకలో ఎందరి గొంతుకలు ఇమిడి పోయాయో చెప్పలేం. మహామహులే ఆయన గొంతుకకు పాదాక్రాంతు లయ్యారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా..తనకు గుర్తింపు తెచ్చిన మిమిక్రీని మాత్రం వదలకుండా పెనవేసుకుని పోయారు. అలా మొదలైన ప్రస్థానం పది వేల ప్రదర్శనల వరకు కొనసాగింంటే ఆయన పట్టుదల ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మిమిక్రీకి ఏమాత్రం గుర్తింపు లేని రోజుల్లోనే ఆ కళపై మక్కువ పెంచుకుని దానికి అర్థం పరమార్థం చెప్పి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన వేణు మాధవ్‌. వైవిధ్య స్వరాలను అనుకరిస్తుంటే నవ్వుల జల్లులు కురిసేవి. ఆయన శిష్యులు ఇవాళ వందల సంఖ్యలో ఉన్నారు. ఆయన ప్రతిభాపాటవాలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంఆయనకు డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. వివిధ రాష్టాల్లో ఆయన లెక్కలేనన్ని పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. తిరుపతిలో అభిమానుల నుంచి గజారోహణ సత్కారం అందుకున్నారు. ఇంతటి వైదుష్యం ఉన్న ఆయన రాజకీయంగా, సీనిరంగాన ఎదగడానికి అవకాశాలు వచ్చినా వాటిని తృణప్రాయంగా వదిలేశారు. రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన మళ్లీ కళ వైపే మళ్లారు. అనూహ్యంగా సినీ అవకాశాలనూ దక్కించుకున్నా వాటిని కూడా కొనసాగించలేదు. ఇలా లేని ఓ కళకే ఊపిరిపోసి దానిని విశ్వవ్యాప్తం చేయడం ద్వారా మిమిక్రీ అనే ప్రాచీనమైన కళకు ఓ రూపం తెచ్చి.. సరికొత్త సొబగులు అద్దారు. చివరకు దాన్ని యూనివర్సిటీ కోర్సుగా తీర్చిదిద్దారు. నిజానికి మిమిక్రీ కళ నాతోనే పుట్టలేదు.. నేను దానికి ఒక సిలబస్‌ ఇచ్చాను అని ఆయన ఎప్పుడూ వినమ్రంగా చెప్పుకునేవారు. రామాయణంలో మాయలేడి రాముని గొంతును అనుకరించడం, మహాభారతంలో భీముడు సైరంధ్రి గొంతును అనుకరించడం మిమిక్రీ యే అనడం ద్వారా దానికి ప్రాచీనతత్వం ఉందని చెప్పేవారు. దీనికి స్వరవంచన అని పేరుకూడా ఉందని చెప్పారాయన. చిన్నప్పుడు వాళ్లనూవీళ్లనూ సరదాగా అనుకరించడంతో మొదలైన ఆయన ధ్వన్యనుకరణ ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైంది. నేరెళ్ల వేణుమాధవ్‌ కళారంగ సేవకు ప్రపంచమే అబ్బురపడింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. కాకతీయ, ఆంధ్రా, జేఎన్‌టీయూసీ ఈ మూడు యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. కనకాభిషేకాలు, గండపెండేరాలు, ఉగాది పురస్కారాలు, కళాప్రపూర్ణ బిరుదులు, ఒకటారెండా.. లెక్కలేనన్నీ అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షా నూటా పదహారువేల నగదు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును మిమిక్రీ దినోత్సవంగా నిర్వహించడం విశేషం.