చివరి రోజు పరిషత్‌ ప్రచార ఉధృతం

అన్ని పార్టీల నేతలు ఉదయమే ప్రజలతో పలకరింపులు
గ్రామాల్లో జోరుగా ర్యాలీలతో ముగింపు
ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): చివరి రోజు కావడంతో శనివారం వివిధ పార్టీల నేతలు ఉదయమే ప్రచారాంలోకి దిగారు. పరిషత్‌లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీనేతలు ప్రచారంలో దూకారు. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుండడంతో ఉదయమే  ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.ఆదిలాబాద్‌ గ్రావిూణ మండలంలోని పలు గ్రామాల్లో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ జడ్పీటీసీ అభ్యర్థి మాడవి హన్మాంత్‌రావు పార్టీ నాయకులతో  కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌ గ్రావిూణ మండలంలోని ఖానాపూర్‌, ఖండాల ఎంపీటీసీ స్థానాల్లోని ఆయా గ్రామాల్లో భాజపా జడ్పీటీసీ అభ్యర్థి దారట్ల జీవన్‌ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం ప్రజలు భాజపాకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖండాల ఎంపీటీసీ కుమ్ర లక్ష్మిబాయి, ఖానాపూర్‌ ఎంపీటీసీ మర్సుకోల లీలబాయి గెలిపించాలని ప్రచారం చేశారు.  స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని గ్రామాల్లో మొదటి విడత పరిషత్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తూ ఆయన మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హావిూ ఇచ్చారు. జిల్లాలో మొదటి విడత పరిషత్‌ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ప్రచారం ఉధృతం చేశారు.  ఆరు మండలాల జడ్పీటీసీలతో పాటు 51 ఎంపీటీసీ స్థానాలకు గాను ఈ నెల 6న పోలింగ్‌ జరుగనుంది.  ఆరు మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలకు 26 మంది, 51 ఎంపీటీసీ స్థానాలకు గాను 179 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రచారంలో మిగితా పార్టీల కంటే టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌ రూరల్‌, జైనథ్‌, బేల, మావల మండలాల్లో పలు గ్రామా ల్లో రోజుకు ఎనిమిది నుంచి పది గ్రామాల్లో పర్యటించి టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరపున స్థానిక నాయకులతో కలిసి మండుటెండల్లో సైతం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నా యకులు, కార్యకర్తలు తమ గ్రామాలకు వచ్చినప్పుడు స్థానికులు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు.