చీప్‌ లిక్కర్‌పై సర్కార్‌ వెనక్కు

C

నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం

పాత పద్దతినే కొనసాగింపు

రూ.3,900 కోట్లతో ఇళ్ల నిర్మాణం

మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో వ్యవసాయ కళాశాలలు

జమ్మికుంటలో పాలిటెక్నిక్‌ కాలేజీ

త్వరలో జల వినియోగదారుల విధానం

మంత్రివర్గ నిర్ణయాలను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):

తెలంగాణలో చీప్‌లిక్కర్‌  అమలు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఈ విషయం ప్రకటించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సిఎం విూడియాతో మాట్లాడుతూ చీప్‌లిక్కర్‌ తేవాలని కొంత చర్చ జరిగిందని… అయితే దానిపై సమాజంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇప్పటికే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకున్నా, గుడంబా అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం దీనిపై కొంత కసరత్తు జరిపింది. ఇక ఐజీ స్థాయి అధికారిని నియమించి గుడుంబాపై ఉక్కపాదం మోపుతామన్నారు. అవసరమైతే గుడుంబా వ్యాపారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు. ప్రజల మనోభావాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గం పలు అంశాలను చర్చించింది. అనంతరం సిఎం మంత్రివర్గ విశేషాలను విూడియాకు వివరించారు. ఇక ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా భావిస్తున్న రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి రూ.3900 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. రూ.3900 కోట్లతో రెండు పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. తొలి దశలో 60 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 4వేల ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్‌ రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు సీఎస్‌ రాజీవ్‌ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని… నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.2631 కోట్లతో బహుళస్థాయి ప్లై ఓవర్లు నిర్మిస్తామని చెప్పారు. పెరిగిన ట్రాఫిక్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

తన చైనా పర్యటన అనంతరం ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయిస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇకపోతే మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినేట్‌  ఆమోదం తెలిపింది.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కూడా  నిర్ణయం తీసుకున్నారు.  రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఏటా 25 వేల కోట్ల రూపాయలు నీటి పారుదల శాఖకు కేటాయిస్తామన్నారు. మిగిలిన సంవత్సరానికి నెలకో వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తామన్నారు.

కాళేశ్వరం లిఫ్ట్‌  ఇరిగేషన్‌కు సంస్థ ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ జల వినియోగ విధానాన్ని

త్వరలో ప్రకటిస్తామన్నారు. అలాగే   తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఉద్యోగుల డీఏ మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర సహాకార బ్యాంకు ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ ఏర్పాటుకు ఆమోదంపై నిర్ణయం తీసుకున్నారు. వృత్తిపన్ను చట్టాన్ని రాష్టాన్రికి వర్తింపచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌ చట్టంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.  వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం తీర్మానించింది.

ఇకపోతే  హైదరాబాద్‌ ఆర్టీసీ బాధ్యతలు జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ రూ.218 కోట్ల నష్టంతో నడుస్తోందని..హైదరాబాద్‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించాలని కేబినెట్‌ నిర్ణయించిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 3,800 బస్సులు నడుస్తున్నయని అన్నారు. టీఎస్‌ఆర్టీసీ లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బోర్డు డైరెక్టరేట్‌గా ఉంటారన్నారు. గతంలో పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించిన సిఎం హైదరాబాద్‌ ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.