చెక్కుల పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ

గందరగోళం లేకుండా కార్యక్రమ నిర్వహణ
ఎండాకాలం కావడంతో ముందస్తు ఏర్పాట్లు
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రైతుబంధు పథకంలో పెట్టుబడి సాయంపొందే అన్నదాతలకు గౌరవ ప్రదంగా చెక్కులను, పట్టేదారు పాస్‌పుస్తకాలను అందజేసేలా గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు అందాయి. మండల కేంద్రాలకు అటునుంచి గ్రామాలకు వీటిని తీసుకువెళ్లేందుకు వాహన సౌకర్యాలు ఏ విధంగా ఉండాలనే విషయంపై సవిూక్షలో సూచించనున్నారు. మే 10నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ఏఈవోలు, వీఆర్వో, వీఆర్‌ఏ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు ఒక గ్రామంలో 300చెక్కులను విధిగా అందజేయాలని సూచిస్తున్నారు. ఎక్కడకూడా అనవసరపు హడావుడి, రైతుల మధ్య తొక్కిసలాట
జరుగకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ పక్రియ కొనసాగించాలని ఆదేశాలు అందాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. సాగులో ఉన్న భూములన్నింటికీ సాయం అందేలా, భూ వివాదాలకు స్వస్థి పలికేలా పక్కాగా, పకడ్బందీగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి విడత నిర్వహించిన ప్రక్షాళన ఆధారంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త పర్యవేక్షణలో సాగుభూములు, పెట్టుబడి పొందే రైతుల వివరాలను తయారు చేశారు. భూ రికార్డుల్లో అక్రమాలకు తావులేకుండా, నకిలీ పాస్‌పుస్తకాలకు చెక్‌పెట్టేలా పలురకాల భద్రతా ప్రమాణాలతో కూడిన పాస్‌పుస్తకాలనుకూడా రైతులకు అందజేస్తున్నారు. మే 10వ తేదీ నుంచి ప్రారంభించ తలపెట్టిన కార్యక్రమంపై, రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించే విధివిదానాలపై కార్యాచరణ రూపొందించారు. జిల్లాల్లో రైతుబంధు చెక్కులు, పట్టేదారు పాస్‌పుస్తకాల సంఖ్య ఆధారంగా పంపిణీ కోసం గ్రామాల్లో ఉన్న స్కూల్‌ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు లేదా ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ పక్కా భవనాలను వినియోగించుకోవాలి. మూడు లేదా ఆ పైబడి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. జిల్లాలోని చెక్కుల సంఖ్య ఆధారంగా పంపిణీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. ఏ కేంద్రంలో ఏ రైతుకు చెక్కులు, పాస్‌పుస్తకాన్ని అందజేస్తారో ముందుగానే గ్రామపంచాయతీల వద్ద సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. పంపిణీ కేంద్రాలవద్ద నీడఉండేలా షామియానాలు, లేదా టెంట్లు ఏర్పాటు చేయడం, తాగునీరు, లైటింగ్‌, ప్రాథమిక చికిత్స కిట్‌, అవసరార్థులకు తగిన సలహాలు ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్‌, పోలీస్‌ బందోబస్త్‌ వంటి సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా ఆరురోజుల నిడివిలో పంపిణీ కార్యక్రమం తప్పనిసరిగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు.