చెత్తను వాడుకుందాం!

wdh1pfq2ప‌నికిరాని చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అందర్నీ ఆలోచింపచేస్తున్నారు ఓరుగ‌ల్లు మున్సిప‌ల్ కార్పొరేషన్‌ అధికారులు. చెత్తను తీసిపాడేయకుండా దాంతో ప్రతీరోజు 60 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోని మున్సిపాలిటీల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. దీనికోసం వ‌రంగ‌ల్ బాల స‌ముద్రంలోని పార్కులో బ‌యోమెథ‌నైజేష‌న్ ప్లాంటును ఏర్పాటు చేశారు కార్పొరేషన్‌ అధికారులు. కార్పోరేష‌న్ ప‌రిధిలోని కూర‌గాయ‌లు, హోట‌ళ్లలోని చెత్తను సేక‌రించి 12 కేవి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
2012లో ఈ ప్లాంటును ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మున్సిప‌ల్ అధికారులు.. ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ తో పార్క్ లోని న‌ర్సరీకి సంబంధించిన 5 హెచ్ పీ బోర్, సాయంత్రం చిల్డ్రన్‌ పార్క్ లైటింగ్‌కు విద్యుత్ ను వినియోగిస్తారు. అంతేకాదు వ‌చ్చిన కూర‌గాయ‌ల చెత్తను కంపోస్టు ఎరువుగా త‌యారు చేసి.. 5 రూపాయ‌ల‌కు కేజీ చొప్పున అమ్ముతున్నారు.

ఒక విద్యుత్ ప్లాంట్ విజ‌యవంతంగా న‌డుస్తుండ‌టంతో.. 48 కేవీ సామ‌ర్థ్యంతో మరో రెండు ప్లాంట్లను ప్రారంభించారు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తి కానుంది. రెండు ప్లాంట్లకు 70 లక్షల ఖర్చువచ్చింది. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్‌లో ఇప్పటికే కొంత భాగం సౌర విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. 24 కేవీ సామ‌ర్థ్యమున్న ఒక ప్లాంటు కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీంతో రాష్ట్రంలోనే పూర్తిస్థాయిలో చెత్త నుంచి వ‌చ్చే విద్యుత్ ను ఉప‌యోగించుకునే తొలి కార్యాలయంగా వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ రికార్డులోకి ఎక్కనుంది. మ‌రికొన్ని బ‌యోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ లు నెల‌కొల్పి పార్క్ లు, ఇత‌ర ముఖ్య ప్రదేశాలకు విద్యుత్ ను ఉప‌యోగించాల‌నే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

మున్సిపల్‌ అధికారుల ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తే.. స్టేట్‌లోని అన్ని మున్సిపాలిటీలు ఓరుగల్లు బల్దియాను ఆదర్శంగా తీసుకోనున్నాయి. చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి, కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశంలోనే ఆదర్శంగా నిలిచే ఛాన్స్ లేకపోలేదు.