చెరువుల పునరుద్దరణతో పెరిగిన ఆయకట్టు

ఆదిలాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు వందల చెరువులు   పునరుద్ధరణకు నోచుకున్నాయి. వివిధ దశల్లో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా అనేక చెరువులకు జలకళ
వచ్చింది. మూడువిడతల్లో సుమారు 1.20లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేశారు. నాలుగో విడతలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 22 చెరువులు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 53చెరువులు, మంచిర్యాల జిల్లాలో 112చెరువులు, నిర్మల్‌ జిల్లాలో 85చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 3,951 చిన్న నీటి వనరులు ఉన్నాయి. ఇందులో 20 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులను మిషన్‌ కాకతీయలో భాగంగా మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి. వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చారు.  కొన్నిచోట్ల  ఇంకా పనులు కొనసాగుతుండగా.. మరికొన్నివేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఆదిలాబాద్‌ డివిజన్‌లో అత్యధికంగా చెరువులుండగా.. వాటి ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో చెరువులు తక్కువగా ఉండగా.. ఆయకట్టు అంతగా లేదు. దీంతో కొత్తగా నిర్మించే చెరువుల్లో ఈ నియోజకవర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అత్యధికంగా బోథ్‌ నియోజకవర్గంలో చెరువులు నిర్మిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కొత్త చెరువుల ప్రతిపాదనలు లేవు. ఇప్పటికే అధికారులు పంపిన ప్రతిపాదనలకు  నిధులు కూడా మంజూరు చేసింది.