చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి
వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలతోపాటు అవసరమైన మౌలిక వసతులు
కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.26 కోట్లు మంజూరయ్యాయి. చేపలపై ఆధారపడి ఉన్న మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా ఎదిగేలా ఈ పథకం ద్వారా సహకారం అందించనున్నారు. చేపల ఉత్పత్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం, వేటకు అవసరమైన
వ్యవస్తీకృత సౌకర్యాలు సమకూర్చ నున్నారు. ప్రాసెసింగ్‌కు, మార్కెటింగ్‌కు సహకారం అందజేయనున్నారు. స్థానిక యూనిట్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ శిబిరాల ద్వారా మత్స్యకారుల్లో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. విత్తన చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేలా
ప్రోత్సహించనున్నారు.  చేప విత్తన క్షేత్రాలను బలోపేతం చేయటానికి యూనిట్‌ విలువ రూ.5 కోట్లు. ఇందులోనూ నూరుశాతం రాయితీ వర్తింపజేస్తారు.  మహిళా మత్స్యకార సంఘాలకు మార్కెటింగ్‌ సహాయం రివాల్వింగ్‌ నిధి సమకూర్చడం కోసం యూనిట్‌ విలువ రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇందులో
నూరుశాతం రాయితీ కల్పించారు.