చేపల పెంపకాన్ని పరిశీలించిన మత్స్యశాఖ అధికారులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ముక్కాల్‌ మండలం రెంజర్లలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రాయితీపై కేజ్‌ కల్చర్‌ పద్ధతిలో పెంచుతున్న చేపలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం డిప్యూటీ డైరెర్టర్‌ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కేజ్‌ కల్చర్‌ విధానంలో చేపలు పెంచడం వల్ల ఎనిమిది నెలల్లోనే ఒక్కో చేప కిలో నుంచి కిలోన్నర వరకు పెరుగుతుంది. దీనిపై మత్స్యకారులకు అవగాహన కలిగించిన మత్స్యశాఖ గత ఏడాది సెప్టెంబరు 5న మత్స్యకార సహకార సంఘానికి 30 వేల చేపపిల్లలను అందించారు. మత్స్యశాఖ అధికారులు చెప్పిన విధంగా చేపలు పెరగకపోవడంతో వారు మత్స్య శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీడీ బుధవారం చేపలను పరిశీలించారు. చేపపిల్లల పెరుగుదలపై ఎదురైన ఇబ్బందులను మత్స్యకారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెంపకానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి సూచించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా ఏడీ రాజనర్సయ్య, స్థానిక మత్స్యకారులు తదితరులు ఉన్నారు.