చైనా మళ్లీ దురాక్రమణ

– రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ‘సరిహద్దు దేశాలతో సామరస్యంగా ఉండటాన్నే భారత్‌ కోరుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే చైనాతో దౌత్యపరంగా, సైనికాధికారుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. అవి తేలేవరకు గతంలో చేసుకున్న ఒప్పందాలకే ఇరువర్గాలు కట్టుబడి ఉండాలి. కానీ, వీటి అమలులో మాత్రం చైనా తీరు భిన్నంగా ఉంది. అంతేకాకుండా, యథాతథస్థితిని మార్చేందుకు మళ్లీ ప్రయత్నించింది. దీనిలోభాగంగా ఆగస్టు 29-30 తేదీల్లో చైనా చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు. చైనా ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం సరికాదన్న విషయాన్ని ఇప్పటికే వారికి స్పష్టంచేసినట్టు వెల్లడించారు. అయితే, సరిహద్దులో ఏర్పడే ఎలాంటి అనిశ్చిత పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు.1988 తర్వాత ఇరుదేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నప్పటికీ చైనా చెప్పేదొకటి, చేసేదొకటని రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 1962లో లద్దాఖ్‌ వద్ద చైనా 38వేల చదరపు కి.విూ మేర ఆక్రమించిందని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌ నుంచి 5వేల చ.కి.విూ భారత భూమిని తీసుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చ.కి.విూల భూభాగం తనదని డ్రాగన్‌ వాదిస్తోందని అన్నారు. ఇలా అన్ని రకాలుగా చైనా మునుపటి ఒప్పందాలకు తిలోదకాలిస్తోందన్నారు. అయితే, ప్రస్తుతం లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రక్షణమంత్రి సభలో పేర్కొన్నారు.