ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భాజపాదే విజయం


– మోదీ పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుగా చూడొద్దు
– ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌
రాయ్‌పూర్‌, నవంబర్‌6 (జ‌నంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ వరసగా నాలుగోసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ధీమావ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో 15ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న ఆయన తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు కొంత ప్రభావం చూపుతాయన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఇచ్చే తీర్పుగా చూడొద్దని ఆయన వ్యాఖ్యానించారు.  ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రుణమాఫీ చేస్తామంటూ రైతులకు ఇచ్చిన హావిూపట్ల విమర్శలు చేశారు. తమ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికే 0శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ రంగం, ప్రజా సరఫరాల విధానంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెవిూపైనెల్స్‌ వంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య తీవ్రపోటీ ఉందని, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 12న తొలిదశలో జరిగే 18స్థానాల ఎన్నికల్లో రమణ్‌ సింగ్‌ పోటీ చేయనున్న రాజనందగావ్‌ నియోజకవర్గం కూడా ఉంది. మిగిలిన 72 స్థానాలకు నవంబరు 20న ఎన్నికలు జరుగుతాయి. ఈ 90 స్థానాల ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి. ఆ రాష్ట్రంలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 49, కాంగ్రెస్‌కి 39, బీఎస్పీకి 1, ఇతరువలకి 1 సీట్లు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో 1.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో దాదాపు 5 కోట్ల మంది ఉండగా రాజస్థాన్‌లో 4.5 కోట్లు, మిజోరంలో 7.6 లక్షలు, తెలంగాణలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ సీట్లు ఉండగా, రాజస్థాన్‌లో 200, తెలంగాణలో 119, మిజోరంలో 40 సీట్లు ఉన్నాయి.