ఛత్తీస్‌ఘడ్‌ సంపదను దోచుకుంటున్న బిజెపి

వారికి రైతులు,గిరిజనులపై ప్రేమలేదు: రాహుల్‌

రాయపూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): పేదలు, రైతులు, యువకుల హక్కుల పరిరక్షణెళి తన రాజకీయ పరమావధి అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గత పదిహేనేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందని అన్నారు. నీళ్లు, అటవీ సంపద, గనులు, ఖనిజాలు పరంగా ఛత్తీస్‌గఢ్‌ దేశంలోనే సంపన్న రాష్ట్రమైనప్పటికీ బీజేపీ ప్రభుత్వ రాజకీయాల కారణంగా ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, అది కేవలం ప్రేమే కానీ అందులో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పార. గిరిజనుల భూములను పరిశ్రమల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఊడలాక్కుంటోందని, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, భూములు తిరిగి ఇవ్వడం కానీ చేయడం లేదని రాహుల్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం కడితే ‘భూ సేకరణ చట్టం’ అమలు చేస్తామని, రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, రైతులు పండించిన పంటలకు బోనస్‌, కనీస మద్దతు ధర కల్పిస్తామని హావిూ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ బుధవారంనాడిక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, పేదలు, రైతులు, యువకుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ 10-15 మంది పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాసే ప్రసక్తే లేదని చెప్పారు. రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు సాధికారిత కల్పించడంతో పాటు యువతకు ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్‌ భరోసా ఇచ్చారు. కాగా, ఈనెల 20న 72 నియోజవర్గాల్లో రెండవది, చివరి విడత పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికల

ఫలితాలను డిసెంబర్‌ 11న ప్రకటిస్తారు.