జంబ్లింగ్‌తో ఇంటర్‌ విద్యార్థులకు నష్టం

యధాప్రకారమే మేలని వాదన
గుంటూరు,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో   నిర్వహించ వద్దని కాలేజీల నిర్వాహకులు మరోమారుకోరుతున్నారు. ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించవద్దని దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు కూడా అంటున్నారు. ఈ మేరకు  ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శిని కలిసి వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. జంబ్లింగ్‌ వల్ల  కలిగే నష్టాలను వివరిస్తామని అన్నారు.  వివిధ జూనియర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా జంబ్లింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు.  ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని సీనియర్‌ విద్యార్థులు తెలిపారన్నారు. ప్రతి కళాశాలలో ప్రయోగ పరికరాల్లో తేడాలు ఉండటం వల్ల ప్రామాణికాల్లో తప్పులు దొర్లుతున్నాయని.. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అనువైన సాధనాలు అందుబాటులో ఉండటంలేదని తెలిపారు. ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను నాన్‌జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఆంధప్రదేశ్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం నాయకులు కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.