జగనే కాబోయే సీఎం

– బాబు ఎగ్జిట్‌పోల్స్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు
– పిలవకున్నా పక్కరాష్ట్రాలకు పోతూ బాబు ఏపీ పరువుతీస్తున్నారు
– వైసీపీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య
కడప, మే21(జ‌నంసాక్షి) : 23న వెలువడే సార్వత్రిక ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించటం ఖాయమని,
వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణియించుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారమని ఆరోపించారు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాల విఫలమయ్యారని, కేవలం తమ అనునూయులకు దోచిపెట్టేందుకే పాలన సాగించారని విమర్శించారు. చంద్రబాబు తీరుతో ప్రజలంతా విసిగిపోయి.. జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీ అభ్యర్థులకు తమ ఓటు వేశారని, 23న ఫలితాల్లో ఇదే స్పష్టమవుతుందని రామచంద్రయ్య అన్నారు.